FbTelugu

ఇప్పుడు తెలిసిందా సారూ..

కరోనా తొలినాళ్లలో తెలంగాణలో దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంది. మొదట్లోనే ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోవడంతో పూర్తిస్థాయి నియంత్రణలోనే ఉంది. దీనికితోడు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ విధించింది.

దీనిని పూర్తిస్థాయిలో అమలు చేసింది. ఆ కాలంలో తెలంగాణలో ఒక్క జీహెచ్‌ఎంసీలో మినహా జిల్లాల్లో ఎక్కడా ఇది విస్తరించలేదు. వైరస్‌ సోకిన వారు కూడా ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత నిజాముద్దీన్ తబ్లిగీ జమాత్ ద్వారా మళ్లీ వైరస్‌ విజృంభించినా వారిని సకాలంలో గుర్తించి క్వారంటైన్లకు పంపడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజుకు నాలుగైదు కేసులు మినహా ఎక్కడా పెద్దగా కేసులు నమోదు కాలేదు. అవి కూడా కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే.

కొన్ని రోజులైతే జీరో కేసులు కూడా వచ్చాయి. కానీ, లాక్‌డౌన్‌ సడలింపులు మొదలు పెట్టిన నాటినుంచి పరిస్థితిలో పూర్తిస్థాయి మార్పులు వచ్చాయి. కుప్పలు తెప్పలుగా కేసులు వచ్చి పడుతున్నాయి. జీహెచ్‌ఎంసీకే పరిమితమైన కేసులు ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణతో పల్లెలకూ చేరాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీతో పాటు దాదాపు అన్ని జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. రోజుకు వందకు పైగానే కేసులు నమోదయ్యే స్థాయికి వెళ్లాయి. దీనికి కారణం లాక్‌డౌన్‌ సడలింపే కారణమన్న సంగతి తెలంగాణలోని సామాన్యుడికి కూడా తెలుసు. కానీ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గారికి మాత్రం కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలిసినట్టుంది. అందుకే గురువారం ఆయన తెలంగాణ సడలింపులతో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రకటించారు.

ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారు, వలస కూలీల ద్వారానే కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. కేసులు కుప్పలు తెప్పలుగా పెరుగుతున్నా కరోనా పరీక్షల సంఖ్య మాత్రం పెంచడం లేదు. ఏమన్నా అంటే ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ అంటారు. వాస్తవానికి లాక్‌డౌన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను యథావిధిగా కాకుండా కొన్ని మార్పులు చేసిన తెలంగాణ సర్కారు ఈ గైడ్‌లైన్స్‌లో మార్పులు చేసి అందరికీ టెస్టులు చేయలేరా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టెస్టుల సంఖ్య పెంచితే కరోనా వ్యాప్తిని నియంత్రించే అవకాశమున్నా తెలంగాణ సర్కారు దీనిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు  ప్రశ్నిస్తున్నారు. పైగా ఉచిత సలహాగా వర్షాకాలంలో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నందున ప్రజలు మరింత జాగ్రత్తతో ఉండాలని మంత్రిగారు చెప్పారు.

జనం జాగ్రత్తగా ఉంటారు సరే.. లాక్‌డౌన్‌ సడలింపుల వల్లే కేసులు పెరుగుతున్నాయన్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించారు కదా.. మళ్లీ పరిస్థితిని చక్కబెట్టే ఉపాయం ఏమైనా అలోచిస్తున్నారా అని తెలంగాణ వాసులు ప్రశ్నిస్తున్నారు. లోపం ఎక్కడో తెలిసింది కదా.. దాని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా మంత్రి గారు చెబితే బాగుండేదని కూడా వారు కోరుకుంటున్నారు.

You might also like