FbTelugu

భౌతికదూరం వారికి పట్టదా..?

తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్‌ నగరం మినహా మిగతా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఆటోలు, క్యాబ్‌లకు అనుమతి ఇచ్చారు.

అయితే, వీటిలో కచ్చితంగా భౌతికదూరం పాటించాలని నిర్ణయించారు. అలా పాటించని ఆర్టీసీ సిబ్బందిపై చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఇలా నిబంధనలు పాటించలేదని సూర్యాపేట జిల్లా కోదాడ డిపో మేనేజర్‌ను విధుల నుంచి తొలగించి డీవీఎంతో విచారణ కూడా నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి కాలంలో ఇలా భౌతికదూరం పాటించడం ఎంతో మంచి పరిణామమే. కానీ, ఇది కేవలం పేదలకేనా.. పెద్దలకు ఈ నిబంధన వర్తించదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనాకు పేద, ధనిక, పెద్ద, చిన్న తేడాలేమీ లేవు. ఇది ఎవరినైనా కబళిస్తోంది. అయితే, తెలంగాణ, ఏపీ సర్కార్లు బస్సుల్లో భౌతికదూరం పాటిస్తుంటే.. కేంద్రం మాత్రం విమానాల్లో భౌతికదూరం నిబంధనలు ఏమీ లేవని చెప్పడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని జనం వాపోతున్నారు. విమాన ప్రయాణికులు కూడా దీనిపై భయపడుతున్నారు. దేశీయ విమాన సర్వీసుల్లో భౌతికదూరం నిబంధనేమీ ఉండదని, ఇంతకుముందు లాగానే అన్ని సీట్లలో ప్రయాణికులను కూర్చోబెట్టేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

వాస్తవానికి విమానాల్లో కూడా భౌతికదూరం తప్పనిసరి అని ఇటీవల కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఇప్పుడు అవేవీ లేవని పౌరవిమానయాన మంత్రి హార్డిప్‌సింగ్‌ పూరి చెప్పారు. పైగా స్వల్పకాలిక విమానయానం చేసిన వారికి 14 రోజుల క్వారంటైన్‌ కూడా అవసరం లేదన్నారు. దీనిని బట్టి చూస్తే విమానసర్వీసుల్లో కనీస నిబంధనలు కూడా ఎందుకు అమలు చేయడం లేదో తెలియక విమాన ప్రయాణికులు, ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.

You might also like