FbTelugu

నిబంధనలు ఒప్పుకుంటాయా?

తెలంగాణలో కరోనా టెస్టుల విషయంలో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అనుమానితులకు టెస్టులు చేసేందుకు ప్రభుత్వం నిరాకరిస్తుంది.

కనీసం మరణించిన వారికి కూడా టెస్టులు చేయడం లేదు. లక్షణాలు కనిపిస్తే తప్ప పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయడం లేదు. దీనిపై రాష్ట్రంలో భారీగా విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అన్నీ ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారమే చేస్తున్నామని, అనుమానితులందరికీ టెస్టులు అవసరం లేదని ఐసీఎంఆర్‌ చెప్పింది కాబట్టి.. మృతదేహాలకు, లక్షణాలు లేనివారికి, కరోనా సోకిన కుటుంబ సభ్యులకు టెస్టులు అవసరం లేదని చెబుతున్నారు.

దీనిపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదు. పైగా మృతదేహాలకు కూడా పరీక్షలు చేయరా అని హైకోర్టు ప్రశ్నిస్తే మంత్రివర్యులు ఒక అడుగు ముందుకేసి వారికి టెస్టులు అవసరం లేదని ఐసీఎంఆర్‌ చెప్పిందని, కోర్టుకు అవగాహన లేక అలా మాట్లాడిందని సెలవిచ్చారు. అయితే, ఇప్పుడు హైదరాబాద్‌ నగర మేయర్‌ రామ్మోహన్‌కు కరోనా అనుమానాలు వచ్చాయి. దీంతో ఆయనకు టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. మేయర్‌ కారు డ్రైవర్‌కు గురువారం కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే, డ్రైవర్‌కు కరోనా లక్షణాలేవీ కనిపించకపోవడంతో మేయర్‌ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగినట్టు సమాచారం.

పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యే వరకూ ఆయన మేయర్‌తో పాటే ఉన్నాడు. దీంతో మేయర్‌ కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. గురువారం అదే డ్రైవర్‌తో కలిసి మేయర్‌ మల్కాజిగిరి, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో మేయర్‌కు కూడా కరోనా సోకి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దశలో మేయర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇది మంచి పరిణామమే. అయితే, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగారు చెబుతున్న ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం మేయర్‌కు లక్షణాలేమీ బయటపడకుండానే కరోనా టెస్టు నిర్వహిస్తున్నారు. అది కూడా రెండోసారి.

ఇంతకుముందు ఒకసారి పరీక్షలు నిర్వహిస్తే నెగెటివ్‌ వచ్చింది. ఇప్పుడు మళ్లీ రెండోసారి మేయర్‌కు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిబంధనలంటూ సామాన్యుల విషయంలో మాట్లాడుతున్న మంత్రిగారూ.. మేయర్‌కు మాత్రం ఆ నిబంధనలు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు పేదలకేనా.. పెద్దలకు కాదా అని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు కరోనా నుంచి అందరినీ ఆదుకోవాలంటే అందరికీ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.