FbTelugu

జర్నలిస్టు కోసం విమానం దారి మళ్లింపు

మినిస్క్: ఒక జర్నలిస్టును అదుపులోకి తీసుకునేందుకు ఏకంగా విమానాన్నే దారి మళ్లించారు. సినిమాను తలపించే విధంగా ఈ ఘటన జరిగింది.
గ్రీస్ రాజధాని ఏథెన్స్ నుంచి లిథువేనియా రాజధాని విల్నియస్ కు ర్యాన్ ఏయిర్ విమానం బయలుదేరింది. 18 దేశాలకు చెందిన 171 మంది ప్రయాణీలతో ఈ విమానం బెలారూస్ మీదుగా వెళ్తున్నది. కొద్ది సమయంలో గమ్యస్థానం చేరుకోనుండగా బెలారుస్ అధికారులు విమాన పైలట్ ను కాంటాక్టు చేసి బాంబు ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారంతో పైలెట్ తో పాటు సిబ్బంది భయాందోళనకు గురై వెంటనే విమానాన్ని అత్యవసరంగా బెలారుస్ రాజధాని మినిస్క్ విమానాశ్రయంలో దించేశారు. హమ్మయ్య ప్రయాణీకులను సురక్షితంగా దించేశానని పైలెట్ లోలోపల శాంతపడ్డాడు. తనిఖీ పేరుతో లోపలికి ప్రవేశించిన భద్రతా సిబ్బంది, తమకు కావాల్సిన వ్యక్తి లభ్యం కావడంతో తో అరెస్టు చేశారు.
ఆయన ఎవరో కాదు… బెలారూస్ దేశ సంచలన జర్నలిస్టు ప్రొటాసెవిచ్.

బెలారూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో విధానాలను తూర్పారబడుతూ నిద్రపట్టకుండా చేస్తున్నారు. ఎన్నో కుంభకోణాలను బయటకు తీసి ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్ల తాగిస్తున్నాడు. తమనే విమర్శిస్తావా అంటూ ఆయనపై ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది. దేశద్రోహం సహా పదుల సంఖ్యలో కేసులు పెట్టినా లెక్క చేయకుండా విమర్శల ధాటిని కొనసాగిస్తునే ఉన్నాడు. రక్షణ కోసం ఆయన విదేశాల్లో తలదాచుకుంటున్నారు. భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంటున్న సందర్భంలో ప్రొటాసెవిచ్ మాట్లాడుతూ.. తనను చంపేస్తారని ఆరోపించాడు. బెలారుస్ దేశం బాంబు ఉందనే నెపంతో విమానాన్ని దారిమళ్లించి, జర్నలిస్టును అరెస్టు చేయడంపై యూరప్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దారిదోపిడి, కిడ్నాప్ వంటి ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డాయి. ఇలాంటి దుస్సాహాస పనులను వదిలేది లేదని, ఆ దేశంపై ఆంక్షలు విధిస్తామని యూరప్ దేశాలు హెచ్చరించాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.