FbTelugu

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే నా బలం: జగన్‌

ఎకానమీలో మీ భాగస్వామ్యం ఉండాలి

భవిష్యత్తులో కరోనా రానివారు ఉండరేమో

తాడేపల్లి: నేను ప్రతిసారీ చెప్తున్నాను నా బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే. మీరంతా ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా గుర్తించానని సీఎం వైఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టాను, అందుకే మీరే మా బలమని మరోసారి చెప్తున్నాను అని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే.. ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టేనని సీఎం అన్నారు. కరోనా వైరస్‌ నివారణలో అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు.

అదే విధంగా క్షేత్ర స్థాయిలో గ్రామ వలంటీర్, సచివాలయం, ఆశా వర్కర్లు, ఏఎస్‌లు, డాక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, పారిశుద్ధ్య కార్మికులు అంతా అద్భుతంగా పని చేశారని కితాబునిచ్చారు.మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా జగన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం ఇప్పుడు నాలుగో విడత లాక్‌డౌన్‌లోకి అడుగుపెట్టామన్నారు. ఇంతకుముందు మనం అనుసరించిన పద్దతి వేరు. నాలుగో విడత లాక్‌డౌన్లో అనుసరిస్తున్న పద్దతి వేరన్నారు. ఈ విడతలో మనం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. కోవిడ్‌ –19 నివారణపై మన దృష్టి పెడుతూ, మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఎకానమీ పూర్తిగా ఓపెన్‌కావాల్సిదేనని, జిల్లాకలెక్టర్లు, ఎస్పీలు అందులో  భాగస్వామ్యం కావాలన్నారు. షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు ఇవి తప్ప మిగిలిన చోట అంతా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని ప్రారంభించాల్సి ఉందని తెలిపారు

చిన్న చిన్న దుకాణాల దగ్గరినుంచి ప్రతీదీ ఓపెన్‌ చేయాలి. రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ప్రజా రవాణా ప్రారంభం అవుతుంది. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు నడుస్తాయి. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. ఈ రెండూ తప్పనిసరిగా పాటిస్తూ.. అన్నీ ఓపెన్‌ కావాలన్నారు.

రాబోయే కాలంలో కోవిడ్‌ రానివారు ఎవ్వరూ ఉండరేమో? అని సంశయం వ్యక్తం చేశారు. అది వస్తుంది.. పోతుంది కూడా. కోవిడ్‌ పట్ల భయాన్ని తొలగించాలి. ఈ వైరస్‌ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కలిగించాలని సీఎం కోరారు.

రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌ను తీసుకొస్తున్నాం. వీటి నిర్మాణం కలెక్టర్ల ప్రథమ పనిగా భావించాలి. అనుమానం ఉన్నవారు అక్కడకువెళ్లి పరీక్షలు చేయించుకుని మందులు తీసుకునే ప్రక్రియ చాలా సాఫీగా సాగిపోవాలని సీఎం జగన్ అన్నారు.

You might also like