FbTelugu

బీజేపీలో అసంతృప్తి సెగలు!

తెలంగాణ బీజేపీలో అసంతృప్తి సెగలు రేగుతున్నాయన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. ఇదివరకే ఈ గ్రూపు రాజకీయాలు ఉన్నాయని, అయితే, ఇటీవల రాష్ట్ర కమిటీ ఏర్పాటుతో మరింతగా పెరిగాయన్న చర్చ ఆ పార్టీ కార్యకర్తల్లోనూ జోరుగా సాగుతోంది. రాష్ట్ర కమిటీలో తను చెప్పిన వారికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌ బాహాటంగానే పెదవి విరిచారు. అంతేకాదు.. తన అసంతృప్తిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే, సంజయ్‌ కూడా గ్రూపు రాజకీయాలు పక్కనబెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. వాస్తవానికి బండి సంజయ్‌కు ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌పై కూడా అనేకసార్లు రాజాసింగ్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

పైగా ఇప్పటి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా తన వర్గాన్ని వెనకేసుకు వచ్చారన్న విమర్శలు కూడా వచ్చాయి. సిటీ పరిధిలో ఉన్న బీజేపీ నేతల్లో ఉన్న మనస్పర్ధలే చివరకు అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన కిషన్‌రెడ్డి చివరకు ఓటమి పాలయ్యారు. దీనికి పార్టీలో విభేదాలే కారణమని కార్యకర్తల్లో జోరుగా చర్చసాగింది. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానంపై కూడా అనేకమంది కన్నేశారు. ఎవరికి వారు అనేక రకాలు ప్రయత్నాలు చేసుకున్నారు. చివరకు ఆ పదవి బండి సంజయ్‌ను వరించింది. అయితే, ఇప్పటివరకు లోలోపల ఉన్న అసమ్మతి కొత్త కార్యవర్గం ఏర్పాటుతో మళ్లీ బయటపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ అసమ్మతి ఎటువైపు దారి తీస్తుందోనని ఆ పార్టీ కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

You might also like