గత కొంతకాలంగా స్నేహహస్తం అందించుకుని, అన్నదమ్ముల వలె కలసి సాగుతున్న తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేగింది.
జల జగడానికి దారి తీస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఆధారంగా ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ మండిపడుతోంది. ఈ విషయంపై కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది.
గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక తెలంగాణతో ఏపీకి మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు పలుమార్లు సమావేశమై స్నేహ హస్తం అందించుకున్నారు. కలిసిమెలిసి సాగాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత విభజన సమస్యలపై చర్చించుకుని చాలావరకు సామరస్యంగా పరిష్కరించుకోవాలని బావించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి కేసీఆర్ ఒత్తిడికి తలగ్గొందన్న విమర్శలూ వినిపించాయి.
అయినప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య ఏడాది కాలంగా ఎలాంటి విభేదాలు లేకుండా జగన్, కేసీఆర్ కలిసి మెలిసి సాగుతున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీల నీటిని తీసుకుని రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు అందించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం ఇటీవల లిఫ్టు ఇరిగేషన్ పథకాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. గతేడాది కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా సుమారు 800 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది. రానున్న రోజుల్లో కృష్ణా బేసిన్లో వరదలు వచ్చే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు.
రానురాను కృష్ణాబేసిన్‌లో కురిసే వర్షపాతం తగ్గిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపు 80వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం నుంచి తీసుకునేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం లిఫ్టు ఇరిగేషన్ పథకాన్ని చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రెండు రాష్ట్రాలకు సమానంగా నీటినీ తీసుకునే వీలుంది. నిర్వహణ ఏపీ ప్రభుత్వం చూస్తోంది. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తమకు చెప్పకుండా నీటిని ఎలా తరలిస్తారని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనివల్ల మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు తీవ్ర నష్టం కలుగుతోందని కేసీఆర్ చెబుతున్నారు. ఉన్నపళంగా కేసీఆర్ సైతం ఉన్నతస్థాయి కమిటీతో సమావేశం ఏర్పాటు ఏపీ చర్యలను ఖండించారు. కృష్ణా బోర్డులో ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు.
ఏపీ ప్రభుత్వం వాదన మరోలా ఉంది. శ్రీశైలం నుంచి నీరు వృథాగా పోతున్నందునే ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని ఏపీ మంత్రి అనికుమార్యాదవ్ చెబుతున్నారు. శ్రీశైలం నీటిని వాడుకునేందుకు తమకు హక్కులు ఉన్నాయని ఆయన మాట. కానీ ఇరు రాష్ట్రాల నిర్వహణలో ఉన్న ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవడం విభజన ఒప్పందాలకు విరుద్ధమేనని నిపుణులు చెబుతున్నారు.
శ్రీశైలం విషయంలో నీటి వివాదం తలెత్తడం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 2006లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పట్నుంచే శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో వివాదం రేగింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు శ్రీశైలం జలాలను తరలించాలని నిర్ణయించడంతో ఇరు ప్రాంతాల మధ్య చిచ్చు రేగింది. దీనిపై తెలంగాణ ప్రాంత నేతలు, నిపుణులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి మరింత ఆజ్యం పోసిన ఘటన కూడా అదే. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రాజశేఖరరెడ్డి వారసుడు జగన్మోహన్రెడ్డి ఏపీకి సీఎం అయ్యాక శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో వివాదం రేగడం విశేషం.