FbTelugu

మా కుమార్తెపై రేప్ జరగలేదు: దిశ తల్లిదండ్రులు

ముంబై: తమ కుమార్తె దిశ సలియాన్ పై అత్యాచారం జరగలేదని, గర్భవతి అని వస్తున్న వార్తల్లో సత్యం లేదని ఆమె తల్లిదండ్రులు వాసంతి సలియాన్, సతీష్ సలియాన్ స్పష్టం చేశారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ దిశ మరణించిన వారం రోజులకే ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దిశకు సాయం చేసే క్రమంలో సుశాంత్ కు ఇబ్బందులు ఎదురు కావడంతో బలవన్మరణానికి పాల్పడ్డారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి బలం చేకూరే విధంగా మహారాష్ట్ర మాజీ మంత్రి నారాయణ రాణే సంచలన ఆరోపణలు చేశారు. దిశ సలియాన్ ది ఆత్మహత్య కాదని, ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డమే కాకుండా హత్య చేశారని ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలు సంచలనం కావడంతో దిశ తల్లిదండ్రులు స్పందించారు. తమ కుమార్తె గురించి తప్పుడు మాటలు మాట్లాడవద్దని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరారు. ఆమె పై ఎవరూ అత్యాచారం చేయలేదని, పోస్టుమార్టం రిపోర్టులు స్పష్టంగా ఉన్నాయని వారు తెలిపారు. కేసు విచారణ కొనసాగుతోందని, అసత్య ప్రచారం చేయవద్దని దిశ తల్లిదండ్రులు విన్నవించారు.

You might also like