FbTelugu

పాఠం నేర్చినట్టేనా ?

కేంద్ర సర్కారుతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యరంగాన్ని నిర్లక్ష్యం చేశాయి. ప్రైవేటీకరణపైనే మొగ్గు చూపాయి. వైద్యరంగానికి బడ్జెట్‌లలో కేటాయింపులను భారీగా తగ్గించేశాయి. ఒకరకంగా వైద్యం అందించడం తమ పని కాదన్నట్టుగా వ్యవహరించాయి. కానీ, కరోనా వారికి గుణపాఠం నేర్పింది. కమ్యూనిస్టు దేశాలైన క్యూబా, చైనా దేశాలు వైద్యరంగం అభివృద్ధికి ఎప్పటినుంచో కృషి చేస్తున్నాయి.

అక్కడ డాక్టర్లకు కొదువ లేదు. అక్కడ వైద్యరంగంలో ఎప్పుడూ రీసెర్చ్‌లు జరుగుతూనే ఉంటాయి. దానికి కావల్సిన నిధులను కూడా ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయి. దీంతో అక్కడ వైద్యరంగం ఎంతో అభివృద్ధిని సాధించింది. అదే ఇప్పుడు వారికి అండగా నిలిచింది. కానీ, ఇండియాలో ప్రభుత్వం వైద్యరంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో కరోనా కాలంలో దానిని ఎదుర్కొనే శక్తి లేకుండా పోయింది. ఈ వాస్తవాన్ని పాలకులు ఇప్పటికి గానీ గుర్తించలేకపోయారు. ప్రభుత్వాలు వైద్యరంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రధానికి విన్నవించారంటే వాస్తవాలు వారికి అర్ధమయినట్టే కదా.. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని కేసీఆర్‌తో మాట్లాడారు. అప్పుడు కేసీఆర్‌ ప్రధాని మోదీకి వైద్యరంగంపై పలు సూచనలు చేశారు. వైద్యరంగంలో భవిష్యత్‌ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాలన్నారు.

ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దీన్ని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విషయంపై దృష్టి పెట్టాలని ప్రధానికి సూచించారు. గతంలో కూడా అనేక వైరస్‌లు ప్రజలను ఇబ్బంది పెట్టాయని.. భవిష్యత్తులో కరోనా వైరస్‌ లాంటివి మరిన్ని వచ్చే అవకాశముందన్నారు. వైద్యరంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకునే విధంగా మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంతమంది డాక్టర్లు ఉండాలి? ఇంకా ఎన్ని మెడికల్‌ కాలేజీలు రావాలి? లాంటి విషయాలను ఆలోచించాలన్నారు. ఐఎంఏ లాంటి సంస్థలతో సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయమని.. ఇది దేశానికి మంచి చేసే చర్య అని సీఎం కెసిఆర్‌ అన్నారు.

కరోనా లాంటివి భవిష్యత్తులో ఏమి వచ్చినా సరే తట్టుకుని నిలబడే విధంగా వైద్యరంగం తయారు కావాలని. దీనికోసం మీరు (ప్రధాన మంత్రి) స్వయంగా చొరవ తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్రం కలిసికట్టుగా పని చేసి, దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది’’ అని ముఖ్యమంత్రి సూచించారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వ వైద్యరంగం అవసరం ఏమిటో తెలిసొచ్చినట్టేలా ఉంది కదా.. అయితే, ఇది కేవలం మాటలకే పరిమితమా.. లేక ఆచరణ కూడా ఉంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

You might also like