FbTelugu

కరోనా కాలం కలిసి వచ్చిందా?

కరోనా కాలం ఒకవైపు ప్రపంచాన్ని గడగడలాస్తుంటే.. దీనిని సాకుగా చేసుకున్న వ్యక్తులు, సంస్థలు తమ కార్యాచరణను ఆమలులోకి తెస్తున్నాయి.

ప్రభుత్వాలు కూడా ఇవే విధానాలను కొనసాగిస్తున్నాయి. మామూలు సమయంలోనే భారత ప్రభుత్వం అనేక కంపెనీలను ప్రైవేటీకరించింది. ప్రైవేటీకరణే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి కరోనా కాలం కలిసి వచ్చిందన్నట్టుగా తయారైంది. అంతా కరోనా కష్టాల్లో ఉన్నారు కాబట్టి పెద్దగా వ్యతిరేకత బయటపడదని ప్రైవేటీకరణ పనులను జోరుగా చేపట్టాయి.

కష్టాల్లో ఉన్న ప్రభుత్వాలను ఆదుకోవాల్సింది పోయి వారికి నష్టం జరిగేలా చర్యలు తీసుకోవడం ఎంతవరకు సబబని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కీలకమైన ఎనిమిది రంగాల్లో ప్రైవేట్‌కు కేంద్ర ప్రభుత్వం బార్లా తెరిచింది. తమ అడుగులు ఎటువైపు ఉంటాయన్నది బడ్జెట్‌ సమయంలోనే కేంద్రప్రభుత్వం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో దానిని మరింత ఉధృతం చేసింది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకంలో నాలుగో విడత కేటాయింపులను శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపిన వివరాలను చూస్తే ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం ఎలా చేయబోతున్నారో తెలుస్తోంది.

బొగ్గు, ఖనిజ, రక్షణ, స్పేస్, డిస్కమ్, అణువిద్యుత్‌ వంటి అన్ని కీలక రంగాల్లో ప్రైవేటుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. పెట్టుబడిదారులతోనూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోనూ సమన్వయం చేస్తూ ఇన్వెస్టిబుల్‌ ప్రాజెక్టులను సిద్ధం చేయడానికి ప్రతి మంత్రిత్వ శాఖలో ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గనుల రంగంలో సరళీకృత వ్యాపార విధానాలు తీసుకొస్తామని, ఖనిజ రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులను మెరుగుపరుస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. పీపీపీ భాగస్వామ్యంతో ఆరు ఎయిర్‌ పోర్టులకు వేలం వేయనున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

ప్రైవేట్‌ భాగస్వామ్యంతో అంతరిక్ష కార్యకలాపాలను పేంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇండియా స్పేస్‌ రంగం ప్రయాణానికి ప్రైవేట్‌ రంగం సహప్రయాణికులు(కో ట్రావెలర్‌)గా ఉంటుందని అన్నారు. ఉపగ్రహాలు, ప్రయోగాలు, అంతరిక్ష ఆధారిత సేవలల్లో ప్రైవేట్‌ సంస్థలకు అవకాశం ఉంటుందన్నారు. ఇస్రో సౌకర్యాలను ఉపయోగించడానికి ప్రైవేట్‌ రంగానికి అనుమతి ఉంటుందని, గ్రహాల అన్వేషణ కోసం భవిష్యత్తు ప్రాజెక్టులు, బాహ్య అంతరిక్ష ప్రయాణం మొదలైన వాటిల్లో ప్రైవేట్‌ రంగానికి తలుపులు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.

వైద్య ఐసోటోపుల ఉత్పత్తి, ప్రోత్సహించడం కోసం పరిశోధన రియాక్టర్‌ను పీపీపీ మోడల్‌లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్యాన్సర్, ఇతర వ్యాధుల చికిత్స కోసం మానవ జాతి సంక్షేమానికి వైద్య ఐసోటోపుల ఉత్పత్తి పీపీపీ మోడల్‌ ద్వారా జరుగుతుం దన్నారు. వ్యవసాయ సంస్కరణలను అభినందించడానికి, రైతులకు సహాయం చేయడానికి ఆహార సంరక్షణ కోసం రేడియేషన్‌ టెక్నాలజీని ఉపయోగించడానికి పీపీపీ మోడల్‌లో సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపిన వివరాలు చూసిన తర్వాత కేంద్రం ప్రైవేటీకరణపై ఎంత స్పష్టంగా ఉందో అర్ధం అవుతోందని, కరోనా కాలంలో దీని స్పీడు పెంచే పనిలో ఉందని రాజకీయ, ఆర్థిక రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

You might also like