FbTelugu

ఆయన మాటెందుకు మార్చారో ?

ఇటీవల కాలంలో అగ్రరాజ్య అధినేత మాటల్లో తేడా కనిపిస్తోంది. ఒక రోజు అన్న మాటను రెండు రోజుల తేడాతోనే వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా ఒకటి కాదు..రెండు కాదు పదుల సంఖ్యలోనే అలాంటి ఘటనలు జరిగాయి. ఇటీవల కాలంలోనే కరోనాకు మాస్కులు ధరిస్తే వైరస్‌ రాదా.. వాటిని ధరించాలని నేను ఎవరికీ చెప్పను.. నేను కూడా ధరించను అన్నారు. ఇది చెప్పిన రెండు రోజుల వ్యవధిలోనే ఆయన తన ప్రకటనను మార్చుకున్నారు. ఆయన కూడా మాస్కు ధరించారు.

అందరూ ధరించాలని సెలవిచ్చారు. అంతకుముందు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులకు వీసాలు ఇచ్చేది లేదని భీష్మించారు. దానికి సంబంధించి ఆర్డర్లు కూడా పాస్‌ చేశారు. ఆ తర్వాత దీనిని కూడా వాపస్‌ తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్ష స్థానానికి జరిగే ఎన్నికలను వాయిదా వేయాలని కోరిన మరునాడే తూచ్‌.. ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నా.. ఎన్నికలు సకాలంలోనే జరపాలని ప్రకటించారు. అసలు ఎన్నికలు వాయిదా వేయాలని ఎందుకు కోరారు. ఒకరోజు తేడాతోనే మళ్లీ ఎందుకు మనసు మార్చుకున్నాడన్న అంశంపై ఇప్పుడు ఆ దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా జోరుగా చర్చ సాగుతోంది. నవంబర్‌ 3న జరగాల్సిన ఎన్నికల్ని వాయిదా వేయాలని గురువారం ట్విట్‌ చేసిన ట్రంప్, తానిప్పుడు ఆ విధంగా కోరుకోవడం లేదంటూ శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్‌లో వివరణ ఇచ్చారు.

‘ఆలస్యం కావాలని నేను కోరడం లేదు. ఎన్నికలు జరగాలన్నదే నా అభిమతం. అయితే, ఫలితాల కోసం మూడు నెలలపాటు వేచి చూడటం కూడా తనకు ఇష్టం లేదు’ అంటూ తన ట్విట్‌పై అడిగిన ప్రశ్నపై మీడియాకు సమాధానమిచ్చారు. గురువారం ట్రంప్‌ తన ట్విట్‌లో ఇలా అన్నారు.. ‘మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ వల్ల 2020 ఎన్నికలు చరిత్రలోనే అతి తప్పుడు, మోసపూరిత ఎన్నికలుగా మిగిలిపోతాయి. ప్రజలు కరోనా నుంచి కోలుకొని క్షేమంగా ఓటు వేసేదాకా ఎన్నికల్ని వాయిదా వేయాలి’ అన్నది ట్రంప్‌ ట్విట్‌లోని సూచన. మరుసటి రోజే ట్రంప్‌ మాట మార్చడానికి తన సొంత పార్టీ(రిపబ్లికన్‌) ముఖ్య నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం కావడమే కారణమని పరిశీలకులు చెబుతున్నారు.

ఎన్నికల వాయిదా అనేది సరైన ఆలోచన కాదంటూ రిపబ్లికన్‌ పార్టీ సెనేట్‌ జ్యుడిషియరీ చైర్మన్‌ లిండ్సేగ్రాహమ్‌ ట్రంప్‌ సూచనను తిరస్కరించారు. అంతేకాదు ఎన్నికలు వాయిదా వేయాలని ట్రంప్‌ కోరాడంటే తన ఓటమిని ముందే గ్రహించాడని, అందుకే ఎన్నికల వాయిదా కోరుకుంటున్నారన్న ప్రచారం కూడా అక్కడ సాగుతోందట. అందుకే ఎన్నికల వాయిదా ప్రకటన వల్ల తనకు నష్టం కలిగే ప్రమాదముందని భావించిన ఆయన వాయిదా ప్రకటనను వెనక్కి తీసుకున్నాడన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. అయితే ట్రంప్‌ సూచన ఎలా ఉన్నా నవంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయని సెనెట్‌లో రిపబ్లికన్‌ విప్‌ జాన్‌థూనే స్పష్టం చేశారు.

You might also like