FbTelugu

మావోయిస్టులు ఆగడాలను అడ్డుకుంటాం: డీజీపీ

ములుగు: చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో గల వెంకటాపురం పోలీసు స్టేషన్ ను డీజీపీ మహేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు.

ఇటీవల చత్తీస్ గఢ్ నుంచి మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రం లోకి ప్రవేశించినట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం అదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మహేందర్ రెడ్డి, ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకున్నారు.

మావోయిస్టుల కట్టడికి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి ఆయన పలు ముఖ్యమైన సూచనలు చేశారు. డీజీపీ పర్యటన నేపథ్యంలో ఏజెన్సీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు ఏటూరు నాగారం సబ్ డివిజన్ లోని వెంకటాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో ములుగు, భూపాలపల్లి కి చెందిన పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మావోయిస్టులు మళ్లీ తెలంగాణలో ప్రవేశించి హింసాత్మక చర్యలకు పూనుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు ఆగడాలను ఈ గడ్డ మీద జరగనివ్వబోదని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. పార్టీ అగ్రనేతలు హరి భూషణ్, దామోదర్ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అమాయక గిరిజనులను బలి పశువులుగా చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో ప్రతి గ్రామం రహదారులతో అనుసంధానింపబడి విద్య, వైద్యం వంటి సదుపాయాలను పొందుతూ సంతోషంగా ఉందన్నారు. ఈ సమయంలో మావోయిస్టులు తిరిగి తెలంగాణలో అశాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలకు పాల్పడే మావోయిస్టులకు రానున్న సమయంలో తెలంగాణ పోలీస్ శాఖ గట్టి దెబ్బ తీస్తుందని మహేందర్ రెడ్డి మావోయిస్టులను హెచ్చరించారు.

You might also like