ఘాటుగా విమర్శించిన షబ్బీర్ అలీ
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని మసీదులు, ఆలయాన్ని కూల్చివేయడాన్ని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ షబ్బీర్ అలీ తీవ్రంగా ఖండించారు.
సచివాలయంలో రెండు మసీదులు, ఒక ఆలయాన్ని ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలోని కాంట్రాక్టర్లు కూల్చివేశారన్నారు. గతంలో ఈ అంశాన్ని లేవనెత్తగా, వాటికి భంగం వాటిల్లకుండా నూతన సచివాలయం భవనాలు నిర్మిస్తామని ప్రభుత్వ హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ ఆదేశం మేరకే రెండు మసీదులు, ఒక ఆలయాన్ని నేలమట్టం చేశారని షబ్బీర్ అలీ ఆరోపించారు. రెండు మసీదులు, ఆలయాన్ని రక్షించాలని కోరుతూ 2019 జూన్ 27 న ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశానని ఆయన గుర్తు చేశారు. అయినా కూల్చేసినట్లు తమకు సమాచారం వచ్చిందని షబ్బీర్ అలీ తెలిపారు. సుప్రీంకోర్టు ఎప్పుడైనా స్టే ఇచ్చే అవకాశం ఉందనే భయంతో హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే కూల్చివేతకు పూనుకున్నారని ఆయన విమర్శించారు.