FbTelugu

కేంద్రం వైఖరిపై ఢిల్లీ హైకోర్టు భగ్గు

న్యూఢిల్లీ: కరోనాతో కొట్టుమిట్టాడుతున్న రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ కోటా పెంచడంలో విఫలమైన కేంద్రాన్ని ఆస్ట్రిచ్ పక్షితో పోల్చింది.

ఇవాళ ఢిల్లీ హైకోర్టు కరోనా పరిస్థితి, ఐసియులో సౌకర్యాలు, ఆక్సిజన్ లభ్యతపై విచారించింది. ఆస్ట్రిచ్ పక్షి మాదిరి మీ తలను ఇసుకలో పెట్టుకోగలరు, కాని మేము అలా కాదని వ్యాఖ్యానించింది. ప్రతిరోజు ప్రజలు అనుభవిస్తున్న నరకాన్ని ప్రత్యక్షంగా చుస్తున్నామని పేర్కొంది. ఆక్సిజన్ లేకపోవడంతో ఆసుపత్రులు మంచాలు తగ్గించుకోవడాన్ని, రోగులు ఆక్సిజన్ లేక ఐసియులో మంచాలను పొందలేకపోవడాన్ని చూస్తున్నామని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ వైద్య మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రతి రోజు 700 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ పొందే హక్కు లేదని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు.

ఈ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రతిరోజు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని, ఇప్పుడు కూడా అదే విధంగా ఆదేశిస్తున్నామని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అమలు చేసిన తరువాతే వచ్చి మళ్లీ సమాధానం ఇవ్వాలని స్పష్టం చేస్తూ కేసు వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.