FbTelugu

కరోనాతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి

థర్డ్ వేవ్ మొదలైందన్న సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ: కరోనా పాజిటివ్ కేసులతో తొలిసారి అతలాకుతలం అయిన ఢిల్లీ క్రమంగా తగ్గి మళ్లీ ఊపందుకోవడం పాలకులను నిద్రపట్టనివ్వడం లేదు. కట్టడి కోసం ఏం చేయాలనే దానిపై పాలకులు దృష్టి సారించారు.
నవంబర్ 11వ తేదీనే 8,593 కేసులు నమోదు అయ్యాయి. 19వ తేదీన 7,546 కేసులు నమోదు కాగా 18వ తేదీన 131 మంది ప్రాణాలు కోల్పోయారు. చలి కి తోడు వాయు కాలుష్యం ఉండడంతో కరోనా కేసుల ఉధృతి అధికమైంది. గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా సంభవించిన కరోనా మరణాల్లో 21 శాతం మరణాలు ఢిల్లీలోనే నమోదు కావడం గమనార్హం.

కాలు బయట పెడితే తప్ప పూట గడవని పేదలే అధికంగా చనిపోతున్నారు. ఉపాధి కోసం బయటకు వెళ్లి వస్తున్న పేద ప్రజల నుంచి మరొకరికి విస్తరిస్తున్నది. వీరు నివసించే ప్రాంతాల్లో కూడా ఇళ్లు ఇరుకుగా ఉండడ, గాలి సంచరించే పరిస్థితి లేకపోవడం కూడా కారణమని వైద్య, ఆరోగ్య శాఖ నిపుణులు అంచనాకు వచ్చారు.

దేశ రాజధాని నగరం లో థర్డ్ వేవ్ కొనసాగుతున్నదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. జన సంచారం అధికంగా ఉన్న మార్కెట్లను మూసివేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని, వైరస్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. వేడుకలకు 200 మందికి మించి హాజరు కాకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకున్నామన్నారు. ఆసుపత్రుల్లో మంచాల సంఖ్య రెట్టింపు చేయాలని, వసతులు పెంచాలని, ఆర్టీపీసీఆర్ కిట్లు అవసరమైనంత మేరకు పంపించాలని కేంద్ర హోం శాఖను కోరినట్లు కేజ్రీవాల్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.