FbTelugu

ఎమ్మెల్యే ఆఫీస్ ముందు వృద్ధురాలు దీక్ష

Deeksha-is-an-old-woman-in-front-of-the-MLAs-office-

చిత్తూరు: పింఛన్ కోసం ఓ వృద్ధురాలు ఏకంగా ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు దిగింది. ఐదు నెలలుగా పింఛన్ రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం వేరు పల్లెకు చెందిన చెంగమ్మ అనే వృద్ధురాలి భర్త చనిపోయాడు. కాగా.. వచ్చే పెన్షన్ డబ్బులతోనే జీవనం గడుపుతొంది. ప్రభుత్వం మారిన తర్వాత గత ఐదు నెలలుగా పింఛను అందట్లేదు. దీంతో ఆమె పింఛనుకోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగి తిరిగి విసిగి పోయింది. చివరకు గత్యంతరం లేక ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట పింఛన్ బుక్కు చేతబట్టుకుని బైఠాయించి ప్లకార్డు పట్టుకుని పింఛన్ కోసం నిరాహార దీక్ష చేస్తోంది. ఇప్పటికైనా తనకు పింఛన్ అందించాల్సిందిగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించాలని అభ్యర్థిస్తోంది. అయితే వృద్ధురాలు చెంగమ్మ నిరాహార దీక్షకు దిగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమెను స్థానిక ఎంపిడిఓ కార్యాలయానికి తీసుకెళ్లారు. పింఛన్ పత్రాలను పరిశీలించిన ఎంపీడీవో దయానందం, మూడు నెలలు వరుసగా పింఛన్ తీసుకోకపోవడంతో చెంగమ్మ పేరు తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే చెంగమ్మ మాత్రం తన పింఛన్ కోసం కాళ్ళు అరిగేలా తిరిగినా లాభం లేకపోగా, అధికారులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటోంది.

You might also like