FbTelugu

ఎన్నికల్లో చెప్పినట్లు వికేంద్రీకరణ చేశాం: సజ్జల

తాడేపల్లి: ముఖ్య‌మంత్రి వైఎస్. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల‌కు ముందు వికేంద్రీక‌ర‌ణే ల‌క్ష్య‌మ‌ని చెప్పార‌ని, అదే చేస్తున్నార‌ని వైఎస్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
వికేంద్రీకరణ చట్టం సరదాగా చేసింది కాదని, నిపుణుల కమిటీ సూచనలు, మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలతో పాటు మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని చేశామన్నారు. మేము చెప్పింది సరైంది కాదని భావిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని రామకృష్ణా రెడ్డి సవాల్ విసిరారు.
చంద్ర‌బాబు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమ‌రావ‌తిని ఎంచుకున్నార‌ని విమ‌ర్శించారు. గ‌త ఐదేళ్లు అమ‌రావ‌తిలో మాయ‌బ‌జార్ సినిమా చూపించార‌ని ఆయన మండిప‌డ్డారు. అమ‌రావ‌తి రైతుల‌ను చంద్ర‌బాబు రెచ్చ‌గొడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. విశాఖ ప్ర‌జ‌లు చాలా దయాగుణం క‌లిగిన వార‌ని, వాళ్ల‌తో రాజ‌ధాని వ‌ద్ద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారని రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.

అమరావతి లో నాలుగేళ్ల పాటు చంద్ర‌బాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ల‌క్ష‌ణంగా భ‌వ‌నాలు నిర్మించ‌వ‌ద్ద‌ని ఎవ‌ర‌న్నారని అన్నారు. క‌నీసం స‌గ‌మైనా పూర్తి చేసి ఉంటే ఈ పాటికి కార్యాక‌లాపాలు మొద‌ల‌య్యేవని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. చంద్ర‌బాబు ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌కుండా ఎడారిలా చేశారని విమర్శించారు. ఆయ‌న క‌ట్టించిన తాత్కాలిక భ‌వ‌నాలు రెండు చినుకులు ప‌డితే చాలు కారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

You might also like