FbTelugu

వివాదాల ప్రబోధానంద మృతి

అనంతపురం: ఆత్మజ్ఞానం పేరుతో హిందూ, ముస్లిం దేవుళ్లపై వివాదాస్పద రచనలు చేసిన ప్రబోధానంద స్వామి మృతి చెందారు.
చిన్న పొలమడలోని ఆశ్రమంలో ఇవాళ మధ్యాహ్నం ప్రబోధానంద స్వామి అనారోగ్యం పాలై చనిపోయినట్లు భక్తులు చెబుతున్నారు. స్వామి అనంతపురం తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడ కేంద్రంగా త్రైత సిద్ధాంతం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పాడు. ఆత్మజ్ఞానం పేరుతో కొన్ని వందల రచనలు చేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ప్రబోధానంద తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె లో 1950లో జన్మించారు. అయన అసలు పేరు పెద్దన్న చౌదరి. సైన్యంలో వైర్ లెస్ ఆపరేటర్ గా పనిచేశారు. ఆ తరువాత తాడిపత్రి తిరిగి వచ్చి ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేశారు. పలు రచనలు చేసి ఆధ్యాత్మిక గురువుగా అవతారం ఎత్తాడు.

హిందూ, ముస్లిం దేవుళ్ళ పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయినా వెనక్కి తగ్గకుండా విమర్శలు గుప్పించేవారు. రెండేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే జేసీ.ప్రభాకర్ రెడ్డి వర్గీయులపై ప్రబోధానంద స్వామి శిష్యులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆశ్రమం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆస్తుల గొడవల కారణంగానే దాడులు జరిగాయని అప్పట్లో విమర్శలు వచ్చాయి. స్వామిని అరెస్టు చేసి, ఆశ్రమాన్ని సీజ్ చేయాలంటూ అప్పటి ఎంపీ జేసీ.దివాకర్ రెడ్డి ఆశ్రమం ముందే నిరసన చేపట్టారు.

You might also like