FbTelugu

కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి

ముంబై: ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత సరోజ్ ఖాన్ గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున హాస్పిటల్ లో మరణించారు. 71 సంవత్సరాల సరోజ్ ఖాన్ శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు.

గత నెల 20వ తేదీన బాంద్రాలోని గురునానక్ హాస్పిటల్ లో చేరిన ఆమెకు తొలుత కరోనా పరీక్షలు నిర్వహించారు. నెగెటివ్ అని తేలడంతో చికిత్స ప్రారంభించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచినట్లు కుమార్తె ప్రకటించింది. సుమారు నాలుగు దశాబ్ధాలుగా రెండువేలకు పైగా చిత్రాలకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. తేజాబ్ లో ఏక్ దో తీన్ పాట, జబ్ వీ మెట్ లో యే ఇష్క్ హై, దేవదాస్ సినిమాలో దోలారే దోలా పాటలకు సరోజ్ ఖాన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఆమె మృతిపట్ల పలువురు బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్ తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
1948 నవంబర్ 20వ తేదీన ముంబైలో నిర్మల, కిషన్ చంద్ సాధు సింగ్ దంపతులకు జన్మించారు. 1961 లో కొరియోగ్రాఫర్ బి.సోహన్ లాల్ ను పెళ్లి చేసుకుని ఆయతో 1965 లో విడిపోయారు. 1966 లో సర్దార్ రోషన్ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. ఈమెకు కుమారుడు హమీద్ ఖాన్, కుమార్తెలు హినా ఖాన్, సుకైనా ఖాన్ ఉన్నారు.

You might also like