FbTelugu

దానం.. నిదానమయ్యారా?

దానం నాగేందర్‌. ఒక విలక్షణమైన రాజకీయ నేత. గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆఫ్‌కోర్సు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారనుకోండి. అది కూడా హైదరాబాద్‌ నగరంలోని నడిబొడ్డులో ఉన్న ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి.

గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆ నాయకుడు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం నియోజకవర్గంలో కూడా తిరగడం లేదు. కారణం ఏమిటి..? పార్టీలో ఆయనకు సముచిత స్థానం దక్కడం లేదని అలకబూనాడా?. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా కూడా పనిచేశారు. హైదరాబాద్‌ నగరంపై తిరుగులేని పట్టు సాధించారు.

అయితే, తదనంతర పరిణామాలతో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఖైరతాబాద్‌ నుంచి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, ఈయన చాలాకాలం నుంచి రాజకీయాలకు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నాడనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో దానంకు చెక్‌ పడింది. పైగా తలసానికి కేసీఆర్‌ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం.. హైదరాబాద్‌ నగరంపై పూర్తి బాధ్యతలు కేటీఆర్‌ తీసుకోవడంతో దానం పరిస్థితి మరింత దిగజారింది. పైగా దానం నాగేందర్‌కు తలసాని కావాలనే చెక్‌ పెడుతున్నాడన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో తలసాని, కేటీఆర్‌లను తట్టుకోలేక, బయటకు రాలేక పోతున్నారని ఆయన సన్నిహితులే గుసగుసలాడుతున్నారు.
తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా..
దానం నాగేందర్‌ది తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పరిస్థితి. అప్పుడు ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం జోరుగా జరుగుతున్న రోజులవి. ఉద్యమకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి సమయంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న దానం చేతిలో కర్ర పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులను రోడ్లపై పరుగులు తీస్తూ తరిమికొట్టారు. పైగా కేసీఆర్‌ను నానా బూతులు తిట్టారు. అప్పటి పరిస్థితులను గుర్తుకు తెచ్చుకున్న కేసీఆర్‌ కావాలనే ఇప్పుడు దానం నాగేందర్‌కు చెక్‌ పెట్టాడన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి మంత్రిగా కొనసాగుతున్న తలసాని, వరంగల్‌ నుంచి మంత్రిగా పనిచేస్తున్న ఎర్రబెల్లి లాంటి వారు మరికొందరు ఇలాగే వ్యవహరించారనుకోండి అది వేరే విషయం.

గులాబీ తమ్ముళ్లు మాత్రం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పనిచేసిన వారినెవరినీ తమ బాస్‌ వదిలిపెట్టరని.. అందులో భాగంగానే దానంపై వేటు పడిందని చెబుతున్నారు. మిగతా వారికి కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. కడియం శ్రీహరిలాంటి వారికి ముందుగా ప్రాధాన్యం ఇచ్చి ఇప్పుడు పట్టించుకోకపోవడాన్ని చూస్తూ ఇది నిజమేనేమో అన్న అనుమానం కూడా కలుగుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.