కరణం బలరాం చెప్పకనే చెప్పేశాడు. బాబోయ్ చంద్రబాబుతో వేగలేకపోతున్నాం. అధికారంలో ఉన్నపుడు కూడా చుక్కలు చూపాడు.
ఇప్పుడూ తన పంథాలోనే నడుస్తున్నాడంటూ ఆవేదన వెలిబుచ్చాడు. పార్టీ మునిగినా తేలినా ఆయనే అంటూ పేద్ద బాంబు పేల్చాడు. ఓకే.. డబుల్ ఓకే. మరి అదేదో అప్పుడే చెబితే పోయేది గా అంటే.. బాబు ఎవరి మాటా వినరంటూ అదో భారీ డైలాగ్. ఏమైనా తనతోపాటు చాలామంది మాజీలు, తాజా ఎమ్మెల్యేలు పార్టీవీడతారని చెప్పిన రెండ్రోజుల్లోనే ప్రకాశం జిల్లాకు చెందిన మాజా మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఫ్యాన్ రెక్కల కిందకు వచ్చాడు.
ఇదంతా పార్టీ మీద ప్రేమా.. లేకపోతే. తనను తాను కాపాడుకునేందుకా! అనే వేరే సంగతి. ఎందుకంటే.. ఈ మధ్యనే శిద్దా గ్రానైట్ సంస్థపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఏకంగా రూ.300 కోట్లకు పైగా జరిమానా విధించారు. లీజులు కూడా రద్దు చేసినట్టున్నారు. తెర వెనుక ఇదంతా నడిపిచ్చింది.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అయితే.. భరోసా ఇచ్చింది మాత్రం కరణం బలరాం అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. పోన్లే.. ఎవరి లాభం వారిది.. ఎవరి ప్రయోజనాలు వారివి.
2014లో అధికారంలోకి రాగానే… చంద్రబాబు చేసింది కూడా ఇదే.. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల ఆశచూపి మరీ తన వైపు తిప్పుకున్నారంటూ వైసీపీ గతాన్ని గుర్తుచేస్తుంది. వైసీపీ బలహీనం చేయాలనే తలంపుతో తమ పార్టీ నేతలను నిర్లక్ష్యం చేశారు. పైగా గాలి ముద్దుకృష్ణమనాయుడు, బుచ్చయ్య చౌదరి, కరణం బలరాం వంటి సీనియర్లను పట్టించుకోలేదనే అవపవాదును సంపాదించుకున్నారు. చివరకు పార్టీ ఓటమికి పరోక్షంగానో.. ప్రత్యక్షంగానే తానే కారకుడయ్యాడు.
ఇప్పుడు అదేబాటలో జగన్ కూడా నడవటం.. మున్ముందు వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుందనే అనుమానాలు తావిస్తుంది. ఏడాది పాలనపై విపక్షాలు మినహా సామాన్య ప్రజలు పెద్దగా విమర్శలు చేయట్లేదు. అంతమాత్రాన జనం గుడ్డిగా తమకే ఓట్లేస్తారని భావించటం కూడా అధికార పార్టీకు చేటు తెస్తుందని గుర్తుంచుకోవాలంటూ మేధావులు సూచిస్తున్నారండోయ్.