FbTelugu

డిమాండ్ పంటలనే పండిద్దాం: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలకు తగినట్లు, మార్కెట్ లో డిమాండు కలిగిన పంటలను సాగు చేసేటట్టు రైతులకు మార్గదర్శకం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రంలో నూతన వ్యవసాయ విధానం రూపకల్పనపై కేసీఆర్ బుధవారం కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వరి మాత్రమే కాకుండా ఇంకా ఏ పంటలు సాగు చేయడం వల్ల రైతులకు మేలు కలుగుతుందో అధ్యయనం చేసి మే 5లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

వరిలో సన్న రకాలను ఎక్కువగా సాగు చేసే విధంగా రైతులను చైతన్య పరచాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించే గోదాముల్లో తప్పకుండా కోల్డ్ స్టోరేజిని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

‘‘తెలంగాణలో ప్రతీ మూలకూ సాగునీరు అందుతున్నది. 24 గంటల కరెంటు వల్ల బోర్ల ద్వారా కూడా జోరుగా వ్యవసాయం సాగుతున్నది. కాబట్టి రైతులను సరిగ్గా నిర్ధేశించగలిగితే లాభదాయక వ్యవసాయం చేస్తారు. పంటల ఎంపికలో, సాగు పద్ధతుల్లో, ఎరువుల వాడకంలో, మార్కెటింగులో మార్పులు వస్తాయి. ఈ దిశగా రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉంది’’ అని కేసీఆర్ అభిలషించారు.

‘‘రాష్ట్రంలో ఎక్కువగా వరి పండిస్తున్నారు. పంటకాలం తక్కువనే కారణంతో దొడ్డు రకాలు పండిస్తున్నారు. కానీ ఎక్కువ మంది జనం సన్నరకాలు తింటున్నారు. సన్నరకాలకు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు సాగునీటి వసతి కూడా ఉంది కాబట్టి రైతులు ఎక్కువగా సన్నరకాలు పండించే విధంగా చైతన్య పరచాలి’’ అని ఆయన చెప్పారు.

‘‘రైతులంతా ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు సాగు చేయాలి. అలా అయితేనే అన్ని పంటలకు డిమాండ్ వస్తుంది. రైతులు తక్కువ శ్రమ, ఎక్కువ దిగుబడి, మార్కెట్ అవకాశాలు, మంచి ఆదాయం పొందగలిగిన పంటలను గుర్తించాలి. వాటిని రైతులకు సూచించాలి. ఏ రైతు ఏ పంట వేయాలో నిర్ణయించి, సాగు చేయించాలి. వేరుశనగ, కందులు, పామాయిల్ లాంటి వాటికి మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇంకా ఇలాంటి డిమాండ్ కలిగిన పంటలను గుర్తించాలి. రాష్ట్రంలో కూరగాయలు, పండ్లకు కూడా కొరత ఉంది. అవి ఏ మోతాదులో పండించాలి అనే విషయంపై కూడా అధ్యయనం జరగాలి. నీటి వసతి పెరిగినందున ఫిష్ కల్చర్ ను కూడా తెలంగాణలో విస్తరించవచ్చా? అనే విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించాలి. పూర్తి స్థాయి అధ్యయనం చేసి మే 5లోగా నివేదిక ఇవ్వాలి’’ అని సీఎం ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.