FbTelugu

ఏ గుంటలో ఏ పంట లెక్కతీయాలి: కేసీఆర్

హైదరాబాద్: నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసి, రాష్ట్రంలోని రైతులంతా వందకు వంద శాతం రైతుబంధు సాయం, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నది తన అభిమతమని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మార్కెట్ లో మంచి డిమాండ్ కలిగిన నాణ్యమైన పంటలు పండించడం ద్వారానే రైతులు మంచి ధర పొందగలుగుతారని వెల్లడించారు. ఏ పంట వేయడం ద్వారా మేలు కలుగుతుందనే విషయంలో వ్యవసాయశాఖ, వ్యవసాయ యూనివర్సిటీ తగు సూచనలు చేస్తుందని, దాని ప్రకారం పంట సాగు చేస్తే రైతుకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పారు.
విభిన్న నేలలు, సమశీతోష్ణ వాతావరణం, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు, రైతు పక్షపాత ప్రభుత్వం లాంటి అనుకూలతలను సద్వినియోగం చేసుకుని తెలంగాణ రైతులు ప్రపంచంతో పోటీ పడే గొప్ప రైతాంగంగా మారాలని ఆకాంక్షించారు.
‘‘తెలంగాణ రాష్ట్ర జీవికలో వ్యవసాయం ప్రధాన భాగం. వ్యవసాయం భవిత ఉజ్వలంగా ఉండాలి. తెలంగాణ రైతులు నాణ్యమైన ఉత్పత్తులు ప్రపంచానికి అందించడం ద్వారా లాభాలు గడించాలి’’ అని సిఎం అన్నారు.
నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసే విధానంపై చర్చించేందుకు గురువారం ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

జిల్లాల నుంచి వచ్చిన అధికారులు, రైతు బంధు సమితుల అధ్యక్షులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖాముఖి నిర్వహించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. వారి నుంచి సూచనలు స్వీకరించారు. ‘‘రైతులంతా ఒకే పంట వేయడం ద్వారా డిమాండ్ పడిపోయి నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికే ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఆలోచించి, నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నది. ఏ సీజన్ లో ఏ పంట వేయాలి? ఎక్కడ ఏ పంట సాగు చేయాలి? ఏ రకం సాగు చేయాలి? అనే విషయాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఏ పంటకు మార్కెట్లో డిమాండ్ ఉందో ఆగ్రో బిజినెస్ విభాగం వారు తేల్చారు. దాని ప్రకారం ప్రభుత్వం రైతులకు తగు సూచనలు చేస్తున్నది. ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం పంటలు వేయడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉండదు’’ అని  కేసీఆర్ స్పష్టం చేశారు.
‘‘రాష్ట్రంలో గత ఏడాది వర్షాకాలంలో వరి పంట 40 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ సారి కూడా అంతే విస్తీర్ణంలో సాగు చేయాలి. గత ఏడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ సారి కొంచెం పెంచి 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలి. గత ఏడాది దాదాపు 7 లక్షల ఎకరాల్లో కంది సాగు చేశారు. ఈ సారి 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలి. సోయాబీన్, పసుపు, మిర్చి, కూరగాయలు తదితర పంటలు గత ఏడాది మాదిరిగానే వేసుకోవచ్చు. వివిధ రకాల విత్తనోత్పత్తి చేసే రైతులు యథావిధిగా చేసుకోవచ్చు. పచ్చిరొట్టను విరివిగా సాగు చేసుకోవచ్చు. వర్షకాలంలో మక్కల సాగు లాభసాటి కాదు కాబట్టి, సాగు చేయవద్దు. యాసంగిలో మక్కలు సాగు చేసుకోవచ్చు. వర్షాకాలంలో మక్కలు వేసే అలవాటు ఉన్న వారు పత్తి, కంది తదితర పంటలు వేసుకవాలి. వరి వంగడాల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలు వేసుకోవాలి. తెలంగాణ సోనాకు డిమాండ్ ఉంది. ఆ రకం పండించాలి. 6.5 ఎంఎం సైజు కలిగిన బియ్యం రకాలకు అంతర్జాతీయ మార్కెట్ ఉంది. కాబట్టి ఆ రకం పండించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.
– ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్లస్టర్ అయిన ఎర్రవెల్లిలో తన సొంత ఖర్చుతో రైతు వేదిక నిర్మిస్తానని ప్రకటించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని మంత్రులంతా తలా ఒక రైతు వేదికను తమ స్వంత ఖర్చుతో నిర్మించడానికి ముందుకొచ్చారు.
– రాష్ట్రంలోని 2602 క్లస్టర్లలో నాలుగైదు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని రైతు వేదికల్లో ఎఇవోకు కార్యాలయం, కంప్యూటర్, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించుకోవడానికి వీలుగా టివి తదితర ఏర్పాట్లు ఉండాలని సిఎం చెప్పారు.

ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచలు:
– ఈ వర్షాకాలం నుంచే రాష్ట్రంలో ఏ గుంటలో ఏ పంట వేస్తున్నారనే లెక్కలు తీయాలి. వ్యవసాయ విస్తరణాధికారులు ఖచ్చితమైన వివరాలు సేకరించాలి. పూర్తి స్థాయిలో క్రాప్ ఎన్యూమరేషన్ జరగాలి.
– రాష్ట్రంలో అమలు చేసే నియంత్రిత పద్ధతిలో పంట సాగు విధానంపై అవగాహన కల్పించేందుకు రానున్న నాలుగైదు రోజుల్లోనే క్లస్టర్ల వారీగా రైతు సదస్సులు నిర్వహించాలి. ప్రభుత్వ ఉద్దేశాన్ని, నియంత్రిత పద్ధతిలో సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలి.
– ఏ ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేయాలనే విషయం ముందే నిర్ధారిస్తారు కాబట్టి, ఆ పంటలకు సరిపడా విత్తనాలను ముందే గ్రామాలకు చేర్చాలి. విత్తన తయారీ సంస్థలతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలి. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ విషయంలో క్రియాశీలంగా వ్యవహరించాలి. రైతుకు కావాల్సిన విత్తనాలను వందకు వంద శాతం అందుబాటులో ఉంచాలి.
– పంట సాగు చేసేటప్పుడు రెండు విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి డిమాండ్ కలిగిన పంటలు పండించాలి. రెండు నాణ్యత కలిగిన పంటలు ఉత్పత్తి చేయాలి. అప్పుడే అతడికి మంచి ధర వస్తుంది. మంచి వంగడాలు తయారు చేయడానికి, మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖలో రెండు కమిటీలను ప్రభుత్వం అతి త్వరలోనే నియమిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ, రీసెర్చ్ అండ్ అనాలసిస్ కమిటీలను నియమిస్తున్నది.
– రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడం కోసమే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లను ఏర్పాటు చేస్తున్నది.
– కల్తీ విత్తన వ్యాపారులు రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. వారు రైతు హంతకులు. అందుకే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ముఖ్యంగా పత్తి, మిర్చి విత్తనాలను కల్తీ చేస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం ఉంది. అలాంటి వారిని గుర్తించి, పిడి యాక్టు కింద అరెస్టు చేసి, జైలులో వేయాలి. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీసు అధికారులు సమన్వయంతో వ్యవహరించి, కల్తీ విత్తన వ్యాపారాన్ని నూటికి నూరు శాతం అరికట్టాలి. ప్రజా ప్రతినిధులెవ్వరూ కల్తీ విత్తన వ్యాపారులను కాపాడే ప్రయత్నం చేయొద్దు.
– గోదావరి ప్రాజెక్టుల కింద సత్వరం నీరు వచ్చే ప్రాంతంలో దీర్ఘకాలిక వరి రకాలు సాగు చేయాలి. కృష్ణా ప్రాజెక్టు పరిధిలో ఆలస్యంగా నీరు వచ్చే ప్రాంతాల్లో స్వల్పకాలిక వరి రకాలు వేసుకోవాలి.
– కంది పంట వేయడం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కందులు కొనుగోలు చేస్తుంది. కంది చేనులో కంది ఆకు బాగా రాలడం వల్ల భూమికి మంచి ఎరువుగా మారుతుంది. భూసారం పెరిగి, తర్వాత వేసిన పంటలో దిగుమతి పెరగడానికి ఉపయోగపడుతుంది. కందిలో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలు వచ్చాయి. వాటిని విత్తుకోవాలి.
– పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలోనే కోటి బెయిళ్ల సామర్థ్యం కలిగిన 320 జిన్నింగు మిల్లులున్నాయి. 70 లక్షల ఎకరాల్లో సాగు చేసినా మద్దతు ధరకు ఢోకా ఉండదు. పత్తి ఎక్కువ పండి, జిన్నింగ్ మిల్లులు లేని ప్రాంతాలు గుర్తించి, అక్కడ కొత్త మిల్లులు వచ్చేలా పరిశ్రమల శాఖ చొరవ చూపాలి.
– జిల్లాల వారీగా అగ్రికల్చర్ కార్డును రూపొందించాలి. ఇది ప్రతీ ఏడాది జరగాలి. పంటల మార్పిడి ఉండాలి. దానికి అనుగుణంగా కార్డు రూపొందించి, దాని ప్రకారమే పంటలను సాగు చేయాలి. పంటల వివరాలు నమోదు చేయాలి.
– జిల్లా, మండల, గ్రామాల వారీగా హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పాడి ప్లాంటేషన్ మిషన్స్ తదితర వ్యవసాయ యంత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క తీయాలి. తెలంగాణ వ్యవసాయంలో భవిష్యత్తులో యాంత్రీకరణ పెంచాల్సి ఉన్నందున, ఎక్కడే ఏది అవసరమో, దేనికి లోటు ఉందో తెలియాలి.
– అన్ని జిల్లాల్లో భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

You might also like

Leave A Reply

Your email address will not be published.