మేడ్చల్: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఒక వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పై ఆగకుండా ఎత్తుకెళ్లి చితక్కొట్టుకు కొట్టడంతో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తన సోదరుడిని ఎత్తుకెళ్లి చితకబాదారంటూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో యువకుల అకృత్యం వెలుగు చూసింది. చర్లపల్లి ఈసీ నగర్ కు చెందిన లింగస్వామి ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. తనను వేధించాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అతన్ని పిలిపించి విచారించారు. మరుసటి రోజు రావాలని చెప్పి పంపించేశారు. పోలీసు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన లింగస్వామిని మాట్లాడదామని మహిళకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఫోన్ చేసి కారులో ఎక్కించుకుని పోయారు.
ఈసీ నగర్ లోనే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో లింగస్వామి నోట్లో గుడ్డలు కుక్కారు. కాళ్లు ఒకరు పట్టుకోగా మరొకరు కర్రలతో విపరీతంగా కొట్టారు. అరుపులు బయట వినిపించకపోవడంతో ఏం జరుగుతుంది ఏమి అనేది ఎవరికి తెలియలేదు. పూర్తిగా నీరసించిపోయి, నడవలేని స్థితిలో ఉన్న లింగ స్వామి కారులో నగరం మొత్తం తిప్పి సికింద్రాబాద్ లో వదిలి వెళ్లారు. లింగస్వామిపై మహిళ బంధువులు తీవ్రంగా దాడి చేసి కొట్టారంటూ సోదరుడు పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేయడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.