FbTelugu

దహన సంస్కారాలు పూర్తి… వారానికి బతికాడు!

కోలకతా: కరోనా వైరస్ సోకిందని ఆసుపత్రిలో చేర్పించారు. పది రోజుల తరువాత చనిపోయాడని కబురు పెట్టడంతో వెళ్లి మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్య క్రియలు నిర్వహించారు. వారం రోజుల తరువాత బతికి ఉన్నాడని ఆసుపత్రివారు చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కంగుతిన్నారు.
ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్వాకం మూలంగానే ఇంత ఘోరం జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఘటన పశ్చిమ బెంగాల్ లోని బలరాంపూర్ ఆసుపత్రిలో చోటు చేసుకున్నది. శిబ్దాస్ బెనర్జీ (75) అనే వృద్దుడికి కరోనా రావడంతో నవంబర్ 4వ తేదీన బసు ఆసుపత్రిలో చేర్చారు. అదే రోజున మరో వృద్ధుడు మోహిని మోహన్ ముఖర్జీ (75) వైరస్ బారిన పడి బసు ఆసుపత్రిలోనే చేరాడు. నవంబర్ 13వ తేదీన శిబ్దాస్ బెనర్జీ కుటుంబ సభ్యులకు ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. పెషెంట్ చనిపోయారని, వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని సమాచారం ఇచ్చారు.

మృతదేహాన్ని పూర్తిగా సురక్షితమైన ప్యాక్ తో చుట్టేయడంతో తమదే అని భావించి ఇంటికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. వారు రోజుల తరువాత శ్రాద్దకర్మలు నిర్వహిస్తుండగా ఆసుపత్రి నుంచి మళ్లీ కాల్ వచ్చింది. శిబ్దాస్ బెనర్జీ బతికే ఉన్నారని, పొరపాటున వేరే వ్యక్తి మృతదేహం ఇచ్చామని తెలిపారు. ఈ సమాచారం విన్న కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. ఆసుపత్రి సిబ్బంది పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ముఖర్జీ కుటుంబ సభ్యులు కూడా భగ్గుమంటున్నారు. తమకు ఇవ్వాల్సిన మృతదేహాన్ని ఇతరులకు ఇవ్వడమేంటని నిలదీశారు. మెడికల్ రిపోర్టులు తారుమారు కావడం మూలంగానే ఇది జరిగిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఇరు కుటుంబాలు పట్టుబడుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.