FbTelugu

మొదటి దానికే దిక్కులేదంటే..!

మొదటి దానికే దిక్కులేదంటే.. రెండోదానికి రెడీ అన్నట్టుగా ఉంది ఇప్పుడు దేశంలో పరిస్థితి. దేశంలో కరోనా రెండో విడతలో విలయ తాండవం చేస్తోంది. ఇక్కడి వాతావరణం భీతావహంగా తయారైంది. ఎక్కడ చూసినా చితమంటలు చిటపటలాడుతున్నాయి. హృదయాలు ఘోషిస్తున్నాయి.

కన్నీరు వరదలై పారుతోంది. వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. రాబందులు తిరుగాడుతున్నాయి. అయినా, ఇవేమీ పట్టనట్టు ప్రభుత్వాలు, పార్టీలు ఓట్లకోసం వెంపర్లాడుతున్నాయి. దేశంలో నిత్యం మూడు లక్షలకు పైగానే కరోనా బారిన పడుతున్నారు. రెండువేలకు పైగా మృత్యువాత పడుతున్నారు. అయినా, ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. కరోనా నియంత్రణకు టీకాలు తెప్పిస్తున్నాం.. వేస్తున్నాం అని ప్రగల్భాలు పలుకుతున్నాయి. కానీ, వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. మొదటి విడతలో 45 సంవత్సరాలు నిండిన వారికి కూడా కరోనా టీకాలు ఎక్కడా దొరకడం లేదు. ప్రభుత్వాలు సరిపోను నిల్వలు లేకపోవడంతో టీకాల కోసం వచ్చిన వారు నిరాశతో తిరిగి వెళ్తున్నారు. దేశంలో ఎక్కడ చూసినా కరోనా టీకాలు లేవు. ఈ రోజు టీకాలు వేయడం లేదు. టీకాలు వచ్చిన తర్వాత రండి అన్న బోర్డులే ఆసుపత్రుల ఎదుట దర్శనమిస్తున్నాయి. ఇక, కోవాగ్జిన్‌ మాటే ఎక్కడా వినబడడం లేదు. మొదట విడత కొవాగ్జిన్‌ టీకా వేసుకున్న వారు రెండో టీకా కోసం వెళితే స్టాక్‌ లేదంటున్నారు.

మొదటి టీకా వేసుకొని నెలన్నర అయినా రెండో విడతకు అదే టీకా దొరక్క చాలామంది రెండో టీకాకు దూరంగా ఉన్నారు. కొవిషీల్డ్‌ కూడా ఇప్పుడు సరిపోవడం లేదు. అది కూడా అందుబాటులో లేకుండా పోయింది. 45 సంవత్సరాల పైబడిన వారికే టీకా సక్రమంగా అందడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ టీకాలు వేస్తామని, వారంతా బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం ప్రకటన జారీ చేసింది. కానీ, ఇదెలా సాధ్యమో అర్ధం కాకుండానే ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలు జారీ చేసిందా అన్న అనుమానం అందరిలోనూ కలుగుతోంది. వాస్తవానికి దేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారు కోట్లల్లో ఉన్నారు. వారందరికీ కావాల్సిన టీకాను ప్రభుత్వం ఇంతవరకు సమకూర్చుకోలేదు. వీటి కొనుగోలు ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కి కూడా రాలేదు. ఇప్పటికే 45 సంవత్సరాలు పైబడిన వారికే టీకాను అందించలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ మే ఒకటో తేదీ నుంచి ఎలా టీకా వేస్తారోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

కేంద్రం ప్రకటించినట్టుగా మే ఒకటో తేదీ నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకాలు ఇవ్వలేమని, జూన్‌ నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే ఏపీ, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు చెబుతున్నాయి. రాష్ట్రాలకు టీకాలు సరిపోను వస్తున్నాయా లేదా అని చూసుకోకుండానే కేంద్రం ఒంటెత్తు పోకడలతో ఆదేశాలు జారీ చేస్తోందని, పైగా టీకాల విషయంలో రాష్ట్రాలకు ఏమాత్రం సహకరించని కేంద్రం పెత్తనం మాత్రం చేస్తోందన్న విమర్శలు వివిధ రాష్ట్రాల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. 45 ఏళ్ల పైబడిన వారికే టీకా అందివ్వలేని సర్కార్లు 18 సంవత్సరాలు నిండిన వారందరికీ టీకా ఎలా ఇస్తారో చెప్పాలని ప్రజలతో పాటు విపక్షాలు కూడా ప్రభుత్వాలు నిలదీస్తున్నాయి. అందరికీ టీకా ఇవ్వాలన్న ఉద్దేశం మంచిదే అయినా, దాని సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా కేవలం ప్రకటనలు చేసినంత మాత్రాన లాభం లేదని, పైగా దీనివల్ల నష్టం కూడా జరుగుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.