FbTelugu

పనికిమాలిన వ్యాక్సిన్లు: బాబా రామ్ దేవ్

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ల మూలంగా ఎలాంటి ఉపయోగం లేదని, తాను ఇంత వరకు వ్యాక్సిన్ తీసుకోలేదని యోగా గురువు రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. ఇటీవలే అల్లోపతి వైద్యంపై విమర్శలుచేసిన ఆయన మళ్లీ వ్యాక్సిన్లను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.1000 కోట్లు పరువునష్టం దావా నోటీసు పంపించిన విషయం తెలిసిందే. ఆ నోటీసు చూసిన రామ్ దేవ్ బాబా మరింత రెచ్చిపోయి వాక్సిన్ల సమర్థత, అల్లోపతి ప్రభావంపై తన దాడిని మరింత పెంచారు. కొన్ని దశాబ్ధాలుగా నేను యోగా, ఆయుర్వేదం అభ్యసిస్తున్నాను, కాబట్టి తనకు వ్యాక్సిన్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు ఆయుర్వేద చికిత్స ద్వారా ఉపశమనం పొందుతున్నారని, భవిష్యత్తులో ఈ వైద్యానికి మరింత గుర్తింపు లభిస్తుందన్నారు.

రెండు వారాల్లో లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని లేదంటే రూ.1000 కోట్ల పరువునష్టం దావా వేస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, ప్రధాన మంత్రికి లేఖలు కూడా రాసింది. కరోనా వ్యాక్సినేషన్ పై ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వెంటనే నియంత్రించాలని ఆ లేఖలో కోరారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా 10వేల మంది డాక్టర్లు చనిపోయారని ఆరోపణలు చేశారు. కరోనా సోకిన లక్షలాది మంది అల్లోపతి వైద్యం తీసుకుని చనిపోయారని రామ్ దేవ్ బాబా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి తాము సిద్దమని ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజయ్ ఖన్నా సవాల్ చేసిన విషయం విదితమే.

You might also like

Leave A Reply

Your email address will not be published.