FbTelugu

తిరుమలలో కొవిడ్ ఆంక్షలు: టిటిడి

తిరుమ‌ల: సర్వ దర్శనం టోకెన్లను 22 వేల నుంచి 15 వేలకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని, భక్తులు ఈ మార్పును గమనించాలని టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.

కోవిడ్ 19 రెండో విడత వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. సర్వదర్శనం టోకెన్లు తగ్గించిన విషయాన్ని ఇతర రాష్ట్రాల భక్తులు దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టిటిడి అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

–  కోవిడ్ 19 రెండవ విడత వ్యాప్తి నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా టిటిడి అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

–  టిటిడి మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతోంది.

–  వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, అన్న ప్రసాద కేంద్రం, కళ్యాణ కట్ట తో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.

–  అన్న ప్రసాద కేంద్రం, గదుల కేటాయింపు కౌంటర్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు ఏర్పాటు చేశాము.

– అద్దె గదుల్లో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తాం. ఖాళీ చేసిన వెంటనే పూర్తిగా శానిటైజ్ చేస్తాం.

–  తిరుమలకు వచ్చే భక్తులు తమ వెంట తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్ లు తెచ్చుకోవాలని కోరుతున్నాము.

–  వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయంలో టిటిడి ఏర్పాటు చేసిన శానిటైజర్ లు భక్తులు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

–  తిరుమలలోని ప్రతి ప్రాంతంలో భక్తులు భౌతిక దూరం పాటించాలని కోరుతున్నాము.

– కోవిడ్ పరిస్థితులను అంచనా వేసుకుని రానున్న రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా తగ్గిస్తాం.

– అలిపిరి వద్ద ప్రతి వాహనాన్నీ శానిటైజ్ చేస్తాం. భక్తులందరికీ థర్మల్ స్కాన్ చేస్తాం.

– భక్తుల సౌకర్యార్థం జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారు తిరుమలకు రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం.

– కోవిడ్ పరిస్థితులను అంచనా వేసి ఏప్రిల్ 14 నుండి ఆర్జితసేవలను ప్రారంభించే విషయాన్ని పునఃపరిశీలిస్తాం.

– తిరుమలలోని అన్ని విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహించి కోవిడ్ జాగ్రత్తలపై సూచనలిచ్చాం. ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ వేయిస్తున్నాం.

– తలనీలాల నిల్వ, వేలం, తరలింపునకు సంబంధించి టిటిడిలో పటిష్టమైన వ్యవస్థ ఉంది. తలనీలాలు దుర్వినియోగమయ్యే అవకాశమే లేదు.

– ఇ-వేలంలో పొందిన బిడ్డర్ కు తలనీలాలు అప్పగించడం వరకే టిటిడి బాధ్యత.

– తలనీలాల తరలింపునకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.

– ఈ విషయమై మిజోరాం పోలీసులను, అస్సాం రైఫిల్స్ పోలీసులను సంప్రదించాం. ఈ కేసు మూలలను గుర్తించేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.