FbTelugu

ఏపీలో వీఐపీల‌కు కోవిడ్ భ‌యం!

పైకి చెప్ప‌ట్లేదు కానీ.. ప్ర‌తి ఒక్క‌రిలో భ‌యం పెరుగుతుంది. అనుమానం అధిక‌మ‌వుతుంది. తుమ్ములు.. ద‌గ్గులు ప‌క్క‌న‌బెట్టి క‌రోనా అనే పేరు వినిపిస్తే చాలు ఒళ్లంతా చెమ‌ట్లు ప‌ట్టేంత‌గా మారింది.

క‌రోనా అంత‌గా భ‌య‌పెడుతున్న వేళ ఏపీలో వ్యాపారులు, రాజ‌కీయ‌నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కూ కాస్త ఒళ్లు జ‌ల‌ద‌రించే ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. క‌ర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ కుటుంబంలో ఆరుగురూ పాజిటివ్ అని ఆయ‌నే చెప్పారు. గుంటూరులో ఎమ్మెల్యే గారు కూడా క్వారంటైన్‌కు వెళ్లొచ్చారు.

మ‌రో ఇద్ద‌రు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇటీవ‌ల ప‌రీక్ష‌లు చేయించుకునేంత వ‌ర‌కూ బ‌య‌ట‌కు వచ్చే సాహ‌సం చేయ‌లేక‌పోయార‌ట‌. టీడీపీ నేత‌లైతే బ‌య‌ట‌కు వ‌చ్చే సాహ‌సం కూడా చేయ‌ట్లేదట‌. సీఎం జ‌గ‌న్ మీడియా స‌మావేశాల‌కు ప‌రిమిత‌మైతే.. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు ఎంచ‌క్కా హైద‌రాబాద్‌లో ఉండిపోయారు.

జ‌న‌సేనాని ప‌వ‌న్ ట్వీట్ల‌తో ప‌రామ‌ర్శిస్తున్నారు. బీజేపీ నేత క‌న్నా కూడా అదే బాట‌. పోన్లే.. ఎవ‌రికి వారు స్వీయ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అయినా.. ఇటీవ‌ల రాజ్‌భ‌వ‌న్‌లో క‌రోనా క‌ల‌కలం అంటూ పుకార్లు బ‌య‌టకు వ‌చ్చాయి. మంత్రి ఆళ్ల‌నాని వ‌ద్ద అటెండ‌ర్‌కూ పాజిటివ్ ల‌క్ష‌ణాలు ఒక‌సారి.. అంత‌లోనే నెగిటివ్ అంటూ రిపోర్టు రావ‌టంతో స‌ద‌రు అటెండ‌ర్‌ను క్వారంటైన్‌కు పంపార‌ట‌. ఇలా వీఐపీల‌ను క‌రోనా వెంటాడుతుంది. ఏపీ సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కూడా మొన్న‌టి మీడియా స‌మావేశంలో ఇదే అనుమానం వ్య‌క్తంచేశారు.

ఒక రాష్ట్రాన్ని న‌డిపించే నాయ‌కుడిగా ప్ర‌జ‌ల్లో ధైర్యాన్ని నూరిపోసేలా విజ్ఞ‌త చూపారు. దీనిపై విప‌క్షాలు ఎన్ని అవాకులు పేల్చినా.. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఇది స‌హ‌జ‌మైన వైర‌స్‌గా చెప్ప‌టం అధిక‌శాతం ప్ర‌జ‌ల్లో క‌రోనా ను ఎదుర్కొనే మాన‌సిక ధైర్యాన్నిస్తుంది. నిత్యం ర‌క్ష‌ణ వ‌ల‌యంలో ఉండే బ్రిట‌న్ ప్ర‌ధానికి సోకిన వైర‌స్ త‌న‌కూ రావ‌చ్చంటూ జ‌గ‌న్ చెప్ప‌టం కొంద‌రికి న‌వ్వులాట‌గా అనిపించినా ఆయ‌న మాట‌ల్లో ఆంత‌ర్యం.. వైర‌స్ వ్యాప్తి తీవ్ర‌త ఎంతగా ఉంద‌నేందుకు ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. ఏమైనా.. ఏపీలో వీఐపీల‌ను ఎన్నికల్లో గెలుపోట‌ములు ఎంత‌గా టెన్ష‌న్ పెడ‌తాయో.. ఇప్పుడు క‌రోనా కూడా అదే చేస్తుంద‌ట‌.

You might also like