FbTelugu

కోవాగ్జిన్ కుంభకోణం… బ్రెజిల్ దర్యాప్తు

సావోపాలో: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ ల అనుమతి పొందని కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొనుగోలుపై బ్రెజిల్ దేశంలో పెద్ద దుమారమే నడుస్తున్నది.
హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సిన్లను తయారు చేస్తున్నది. ఈ వ్యాక్సిన్ సరఫరా కోసం బ్రెజిల్ ప్రభుత్వం భారత్ బయోటెక్ తో ఒప్పందం కుదుర్చుకున్నది. దీని వల్ల అధ్యక్షుడు బొల్సొనారో సన్నిహితులు భారీగా లబ్ధి పొందారని సెనెటర్లు ఆరోపిస్తున్నారు. ఇదో పెద్ద కుంభకోణంగా సెనేటర్లు అభివర్ణిస్తున్నారు. సెనేటర్లు పట్టుబట్టడంతో పార్లమెంటరీ కమిషన్ ఆప్ ఎంక్వైరీ దృష్టి సారించింది. అమెరికాకు చెందిన ఫైజర్, చైనాకు చెందిన సినోవాక్ ను కాదని ఎలాంటి అనుమతులు లేని కోవాగ్జిన్ తీసుకోవడంపై సెనేటర్లు భగ్గుమంటున్నారు.

పార్లమెంటరీ కమిషన్ ఇవాళ కొనుగోలులో మధ్యవర్తిత్వం వహించిన ప్రెసిసా మెడికామెంటోస్ మేనేజింగ్ పార్ట్ నగర్ ఫ్రాన్సిస్కో మాక్సిమియానో ను ప్రశ్నించనున్నది. ఇప్పటికే ఆయనకు సంబంధించిన కాల్ డేటా, ఈ మెయిళ్ల వివరాలను సేకరించింది. సెనేటర్లు నిర్వహించే విచారణను ఇవాళ బ్రెజిల్ టీవీల్లో ప్రత్యక్ష ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సిన్ సాంకేతిక బదిలీ కోసం బ్రెజిల్ ప్రభుత్వం నుంచి రూ.2,230 కోట్లు తీసుకున్నది. సాంకేతిక బదిలీ ఒప్పందం ప్రకారం రెండు కోట్ల వ్యాక్సిన్ డోసులను బ్రెజిల్ తన దేశంలో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. 2020 నవంబర్ లోనే ఈ ఒప్పందం జరగడం విశేషం. మధ్యవర్తిత్వం వహించిన ప్రెసిసా మెడికామెంటోస్ కు రూ.734 కోట్ల లబ్ధి జరిగిందని పార్లమెంటరీ కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. ఈ కంపెనీ ద్వారా బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో సన్నిహితులకు వాటాలు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒప్పందం మొత్తంలో మూడో వంతు డబ్బులు రూ.734 కోట్లు కమీషన్ రూపంలో దక్కడం పట్ల పలు అనుమానాలకు తావిస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.