FbTelugu

3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి

సోషల్ మీడియా సంస్థలకు ఏపీ హైకోర్టు ఆదేశాలు

అమరావతి: కొంత మంది న్యాయ వ్యవస్థను కించపరిచేలా పోస్టింగ్ లు పెట్టడంపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత సోషల్ మీడియా సంస్థలను ఏపీ హైకోర్టు ఆదేశించింది.

యూ ట్యూబ్, గూగుల్, ఇన్ స్టా గ్రామ్, వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఇటీవల కొందరు న్యాయ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలతో పోస్టింగ్ లు పెట్టడం జరిగింది. ఈ పోస్టింగులపై హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుపై మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే.మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారించింది.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన విచారణకు సంస్థల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులైన హరీష్‌ సాల్వే, ముకుల్‌ రోహత్గీ, అభిషేక్‌ సింఘ్వీ, కపిల్‌ సిబాల్‌, సంజయ్‌ పువయ్య, పొన్నప్ప తదితరులు హాజరయ్యారు. సంబంధిత సోషల్ మీడియా సంస్థలు కౌంటర్లు దాఖలు చేసేందుకు హైకోర్టు 3వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 7కి వాయిదా వేసింది.

ఈ కేసులో నోటీసు అందుకున్న న్యాయవాది మెట్టా చంద్రశేఖర్‌ హైకోర్టుకు బేషరతు క్షమాపణ తెలిపారు. మౌఖిక అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోబోమని, లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

You might also like