FbTelugu

పోలవరం అవినీతి తేలుస్తాం: మంత్రి అనిల్

పోలవరం: పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై నివేదికను ఇంకా కేంద్రానికి పంపలేదని ఇరిగేషన్ శాఖా మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
సోమవారం పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పర్యటించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఆ విషయమే చెబితే.. పోలవరంలో అవినీతే జరగలేదని ప్రచారమా..? అని ప్రశ్నించారు. విజిలెన్స్ నివేదిక రాక మునుపే… అవినీతి లేదని క్లీన్ చిట్ ఇచ్చుకుంటారా..? అన్నారు. పోలవరంతో పాటు.. పట్టిసీమలో కూడా అవినీతి లేదని ఓ వర్గం మీడియా ఎల్లో రాతలు రాస్తున్నదని ఆయన విమర్శించారు.

పట్టిసీమలో రూ. 300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని కాగ్ తేల్చిందన్నారు. పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.800 కోట్లు ఆదా చేశామన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో పోలవరం పనులు నామినేషన్ పై కట్టబెట్టి కమీషన్లు కొట్టేశారు. 20 శాతం పూర్తి చేసి.. 70 శాతం పూర్తి చేశామని టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని అనిల్ ఆరోపించారు.
నోరు తెరిస్తే.. చంద్రబాబు నాయుడు, ఆయన హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు 70 శాతం పూర్తి చేశామని పోలవరం ప్రాజెక్టుపై అబద్ధాలు చెబుతున్నారని మంత్రి చెప్పారు. రూ. 55 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రూ. 17 వేల కోట్లు ఖర్చు పెట్టి.. 70 శాతం పూర్తైందని ఏ విధంగా చెబుతారని మంత్రి నిలదీశారు. పోలవరం మేమే పూర్తి చేస్తాం.. జాతికి అంకితం చేస్తామని మంత్రి అనిల్ యాదవ్ పునరుద్ఘాటించారు.

You might also like