FbTelugu

ఇండియాను వణికిస్తున్న కేసులు

న్యూఢిల్లీ: భారత దేశాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్నది. వైద్య వ్యవస్థనే కుప్పకూల్చుతోంది. ఆక్సిజన్ అందక పలువురు ఐసియులోనే ప్రాణాలు విడుస్తున్న హృదయవిదారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కల్లోల తీవ్రత స్పష్టంగా కనపడుతోంది. గడచిన 24 గంటల్లో 3,46,786 మందికి పాజిటివ్ నిర్థారణ కాగా 2,624 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం మూడు వారాల వ్యవధిలో పాజిటివ్ కేసులు మూడు రెట్లు పెరిగాయి.

మరణాలు కూడా భారీ సంఖ్యలో ఉండడంతో భయాందోళనకు గురి చేస్తున్నది. ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు 1,66,10,481 కాగా 1,89,544 మంది మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీలో వైరస్ ప్రజలను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నది. కొన్ని రోజుల నుంచి అక్కడ ప్రతి రోజు 20వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. శుక్రవారం నాడు 24వేల మందికి పైగా కరోనా రాగా 348 మంది మరణించారు. సుమారు లక్ష మంది వరకు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ కావాలంటూ పలు హాస్పిటళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మొరపెట్టుకుంటున్నాయి.
మహారాష్ట్రలో మరింత దయనీయంగా పరిస్థితులు ఉన్నాయి. ఒకే రోజు 66,836 మంది కి పాజిటివ్ నిర్థారణ కాగా 773 మంది ప్రాణాలు విడవడం తో ప్రజలు భీతిల్లిపోతున్నారు. అనూహ్యంగా కేసులు వస్తుండడంతో సేవలు చేయలేక వైద్యులు, వైద్య సిబ్బంది నానా పాట్లు పడుతున్నారు. ఇంటికి వెళ్లకుండా, విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.