FbTelugu

క‌రోనా.. ట్వంటీ.. ట్వంటీ!

క‌రోనా వైర‌స్ వ్యాప్తి శ‌ర‌వేగంగా పెరుగుతుంది. దేశంలో 2.70ల‌క్ష‌ల కేసుల‌కు చేరాయి. తెలంగాణ‌లో హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్నట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఏపీలో కూడా ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చిన‌ట్టు క‌నిపించ‌ట్లేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 10,000 కేసుల‌కు చేరుతున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో రోజురోజుకూ కేసుల ఉదృతి అధిక‌మ‌వుతుంది. లాక్‌డౌన్ ఆంక్ష‌లు ఎత్తివేశాక‌.. రోజూ 100కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం నాటికి తెలంగాణ‌లో 4111 కేసులున్నాయి. మ‌ర‌ణించిన వారి సంఖ్య 156కు చేరింది. లాక్‌డౌన్ విధించిన‌పుడు అదుపులో ఉన్న ప్ర‌జ‌లు క్ర‌మంగా రోడ్ల‌పైకి వ‌స్తున్నారు.

భౌతిక‌దూరం పాటించ‌కుండా.. మాస్క్‌లు ధ‌రించ‌కుండా తిర‌గ‌ట‌మే వైర‌స్ వ్యాప్తికి కార‌ణ‌మంటూ వైద్యులు చెబుతున్నారు. మ‌రోవైపు సికింద్రాబాద్ గాంధీ ఆసుప‌త్రిలో అందుతున్న వైద్య‌సేవ‌ల‌పై భిన్న‌వాద‌న‌లు వినిపిస్తున్నాయి. వైద్యుల‌కూ వైర‌స్ సోక‌టం.. ప‌దుల నుంచి వంద‌ల సంఖ్య‌లో పోలీసు, వైద్య సిబ్బంది బాధితులుగా మారటం ఆందోళ‌న క‌లిగిస్తుందంటున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతున్న లెక్క‌ల‌పై కూడా కొంత వ్య‌తిరేక‌త నెల‌కొంది.

ఇదంతా ప్ర‌భుత్వాన్ని అధికారులు త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నట్టుగా క‌నిపిస్తుంద‌నే అనుమానాలు లేక‌పోలేదు. ఏమైనా.. వైర‌స్ ఇంత వేగంగా పెరుగుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోయారు. చాలిన‌న్ని బెడ్లు కూడా లేక‌పోవ‌టంతో.. అర‌వై లోపు ఉన్న‌వారి ఆరోగ్య ‌ప‌రిస్థితిని బ‌ట్టి ఇంటికి పంపుతున్నారు. వైర‌స్‌ ల‌క్ష‌ణాలు లేని వారికి ఇంటి వ‌ద్ద‌నే వైద్యం అందిస్తున్నారు. ఇటువంటి విప‌త్క‌ర స‌మ‌యంలో మున్ముందు ప‌రిస్థితులు చేయిదాటితే ఏం చేయాల‌నేది కూడా ప్ర‌భుత్వాల‌కు స‌వాల్‌గా మారింది.

You might also like