FbTelugu

5 గంటల్లోనే కరోనా టెస్టు పూర్తి

అభివృద్ధి చేసిన సీసీఎంబీ

ఐసీఎంఆర్ అనుమతి కోసం దరఖాస్తు

హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ (సీసీఎంబీ) కరోనా పరీక్ష సమయాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది.

సీసీఎంబీ అభివృద్ధి చేసిన నూతన డ్రై స్వాబ్ పరీక్షకు అనుమతి లభిస్తే కేవలం 5 గంటల వ్యవధిలోనే ఫలితం వస్తుంది. ప్రస్తుతం 15 నుంచి 18 గంటల సమయం తీసుకోవడంతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. డ్రై స్వాబ్ పరీక్షా విధానానికి అనుమతించాల్సిందిగా సీసీఎంబీ, ఐసీఎంఆర్ కు దరఖాస్తు చేసింది. అనుమతి లభిస్తే రాష్ట్రంలో పరీక్షల ఫలితాలు వేగంగా, కచ్చితత్వంతో తొందరగా లభ్యమయ్యే అవకాశం లభిస్తుంది.

ప్రస్తుతం కరోనా అనుమానితుల నోరు లేదా ముక్కు నుంచి ఒక పుల్ల (స్వాబ్) ద్వారా సేకరిస్తున్నారు. ఆ తరువాత దీన్ని వైరల్ ట్రాన్స్ ఫర్ మీడియం (వీటిఎం) అనే ద్రవంలో పెట్టి ల్యాబ్ లకు పంపిస్తున్నారు. ఈ విధానంలో రెండు మూడు ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి వీటీఎం రవాణ కాగా రెండోది ల్యాబ్ కు రవాణా చేసే క్రమంలో వీటీఎం బయటకు లీకయ్యే ప్రమాదం ఉంది. రెండు వీటీఎంలు కలిస్తే ఆ నమూనాలు పరీక్షించడానికి ఏమాత్రం పనికి రావు. మళ్లీ బాధితుల నుంచి నమూనాలు సేకరించాల్సి ఉంటుంది.

ఇక మూడో ప్రధాన సమస్య ఏమంటే ల్యాబ్ కు వచ్చిన తరువాత పరీక్షించడానికి కనీసం 15 గంటల నుంచి 18 గంటల సమయం తీసుకుంటున్నది. అత్యధిక సమయం తీసుకోవడం మూలంగా అనుకున్న స్థాయిలో పరీక్షలు చేయలేకపోతున్నారు. గడచిన మూడు నాలుగు నెలలుగా పరీక్షల విధానాన్ని అధ్యయనం చేసిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు కొత్త విధానానికి రూపకల్పన చేశారు.

దీనినే డ్రై స్వాబ్ అంటారు. ప్రత్యేక పుల్ల ద్వారా సేకరించి, ద్రవ రూపంలో కాకుండా నేరుగా ప్రత్యేక ట్యూబ్ లో భధ్రపరిచి ల్యాబ్ కు పంపిస్తారు. ఈ విధానంలో ఒకరి నమూనా మరొకరి నమూనాలో కలిసిపోయే ప్రమాదం ఉండదు. ఈ నమూనాను పీసీఆర్ మిషన్ లో కేవలం 5 గంటల్లో పరీక్షించవచ్చు. సమయం తగ్గడంతో పాటు ఖర్చు కూడా సగం తగ్గుతోంది. ఈ నూతన పరీక్షా విధానానికి అనుమతించాల్సిందిగా సీసీఎంబీ, ఐసీఎంఆర్ కు దరఖాస్తు చేసింది. అనుమతి లభిస్తే తెలంగాణవాసులకు పెద్ద సమస్య తప్పినట్లే.

You might also like