FbTelugu

 మళ్లీ ఇదేం పంచాయితీ?

కరోనా కేసులు దేశంతో పాటు తెలంగాణలోనూ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో టెస్టులు, చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులకు కూడా అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కారు. అయితే, అక్కడ దేనికి ఎంత ఫీజు వసూలు చేయాలనే నిబంధన విధించింది.

దీనిపై జీఓను కూడా విడుదల చేసింది. ఆ జీఓ ప్రకారం రోగిని ఐసోలేషన్‌లో ఉంచితే రోజుకు రూ.4వేలు, ఐసీయూలో ఉంచితే రూ,7,500, ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచితే రూ.9వేలు వసూలు చేయాలని, అంతకుమించి ఒక్క పైసాకూడా అదనంగా వసూలు చేయవద్దని తెలంగాణ సర్కారు జీఓను విడుదల చేసింది. కానీ, వాస్తవ పరిస్థితుల్లో ఈ జీఓను ప్రైవేటు ఆసుపత్రులేవీ అమలు చేయడం లేదు.

ప్రభుత్వం ప్రకటించిన చార్జీలను కాకుండా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నాయి. ఇటీవల తార్నాకకు చెందిన 58 సంవత్సరాల మహిళ అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్లు కొవిడ్‌ సోకినట్టు నిర్ధారించారు. రోజుకు లక్ష రూపాయల చొప్పున 14 రోజులకు 14 లక్షలు అవుతుందని.. ఆ డబ్బును రెడీగా ఉంచుకోవాలని చెప్పారు. అంత డబ్బు తమ వద్ద లేదని, ఇప్పటికే అప్పుచేసి రెండున్నర లక్షలు చెల్లించామని ఎంత బతిమిలాడినా ఆసుపత్రి నిర్వాహకులు వినడం లేదని ఆ మహిళ కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

ప్రభుత్వం చెప్పిన ప్రకారం డబ్బులు తీసుకొమ్మని అడిగితే అలా అయితే, ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లండి.. ఇక్కడికెందుకు వచ్చారు అని దుర్భాషలాడుతున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం కేవలం జీఓలను విడుదల చేసి చేతులు దులుపుకోవడం కాదు.. అవి అమలయ్యేలా చూసే బాధ్యత కూడా తీసుకోవాలని జనం అభిప్రాయపడుతున్నారు. లేకుంటే ప్రభుత్వం జీఓ తెచ్చినా ఫలితం ఉండదని వారు ఆందోళన చెందుతున్నారు.

You might also like