FbTelugu

కుడి ఎడమైంది.. పొరపాటూ జరిగింది..

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌ అని ఓ సినీకవి చెప్పాడు. కానీ, ఇక్కడ కుడి ఎడమైతే పెద్ద పొరపాటే జరిగింది. కరోనా కాలంలో ఇలాంటి కుడి ఎడమలు కావడం లాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో కరోనాతో చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు తెలియజేయకుండానే మున్సిపాలిటీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు.

మీ కుటుంబ సభ్యుడు కరోనాతో గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. చివరి చూపునకు రండి అని వైద్య సిబ్బంది మరో కుటుంబానికి సమాచారం ఇచ్చారు. తీరా వచ్చి చూస్తే అతడు తమ కుటుంబ సభ్యుడు కాదు. ఒక రోగి ఆసుపత్రి నుంచి పరారు అయ్యాడని, అతడికోసం తీవ్రంగా గాలిస్తున్నామని వైద్య సిబ్బంది ప్రకటించిన రోజే అతడి మృతదేహం ఆసుపత్రి శవాల గదిలో దొరికింది. తప్పించుకున్నాడని చెప్పిన వ్యక్తి శవంలా మార్చురీలో ఉంటే.. మరి తప్పించుకున్నదెవరు.. ఆ ప్రశ్నకు ఇంతవరకూ సమాధానం లేదు.

ఇలాంటి ఘటనలు జరుగుతుంటే హర్యానాలో మరో దారుణ ఘటన జరిగింది. కరోనా మృతుడు అనుకొని హత్యకు గురైన ఓ వ్యక్తి మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగింది. ఇటీవలే ఫరీదాబాద్‌కు చెందిన ఓ 28ఏళ్ల యువకుడిని కొందరు కత్తితో పొడిచి చంపేశారు. దీనిపై హత్యకేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు యువకుడి మృతదేహాన్ని స్థానికంగా ఉన్న బీకే ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది. అయితే ఆస్పత్రి సిబ్బంది ఆ శవాన్ని దహనం చేయడానికి మున్సిపల్‌ సిబ్బందికి అప్పగించేశారు.

ఇదేంటి? అని అడగ్గా కరోనా మృతుడని పొరబడ్డామని బదులిచ్చారు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు ఆస్పత్రి అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. చూశారా..కరోనా కాలంలో ఇలా కుడి ఎడమలు ఎలా అవుతున్నాయో..!

You might also like