FbTelugu

743 మందికి క‌రోనా పాజిటివ్‌: టీటీడీ ఈఓ

తిరుమల: ఉద్యోగుల్లో మొత్తం 743 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిందని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వీరిలో ఇప్ప‌టికే 402 మంది కోలుకోగా 338 మంది చికిత్స పొందుతున్నారన్నారు.

ముగ్గురు మృతి చెందడం బాధాకరమని ఆయన అన్నారు. ఆదాయం కోసం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారి ద‌ర్శ‌నాలు చేయిస్తోంద‌ని, మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా అనేక మంది చేస్తున్న విమ‌ర్శ‌ల్లో వాస్త‌వం లేద‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిబంధ‌న‌లకు లోబ‌డి అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ రోజుకు 12 వేల మందికి ద‌ర్శనం క‌ల్పించే ఏర్పాటు చేశామ‌న్నారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఆదివారం జ‌రిగిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు.

తిరుప‌తిలో పాక్షిక లాక్‌డౌన్ కార‌ణంగా, తిరుప‌తిలో రోజుకు కేటాయిస్తున్న 3 వేల ఉచిత ద‌ర్శ‌న టోకెన్ల‌ను కొంత‌కాలంగా నిలిపివేసిన‌ట్టు చెప్పారు. తిరుప‌తిలో క‌రోనా కేసులు పెర‌గ‌డానికి తిరుమ‌ల ద‌ర్శ‌నాలే కార‌ణ‌మ‌ని కొంత‌మంది చేస్తున్న విమ‌ర్శ‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని ఆయ‌న చెప్పారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి రాలేని భక్తులు ఇ-హుండీ ద్వారా ఆన్‌లైన్‌లో కానుకలు సమర్పించవచ్చు. www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా గానీ, గోవింద మొబైల్‌ యాప్‌ ద్వారా గానీ భక్తులు కానుకలు చెల్లించవచ్చని అనిల్ సింఘాల్ తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ను యాడ్‌ ఫ్రీ ఛానెల్‌గా మారుస్తామని ఆయన వెల్లడించారు. ఎస్వీబీసీ నిర్వహణకు ఏడాదికి రూ.3 కోట్ల నుండి రూ.4 కోట్ల వరకు వ్యయం అవుతోంది. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీబీసీ ట్రస్టుకు మూడు వారాల వ్యవధిలోనే రూ.2.61 కోట్ల విరాళాలు అందాయన్నారు. ట్రస్టుకు వచ్చే ఆదరణను బట్టి టీటీడీపై అద‌న‌పు భారం ప‌డ‌కుండా ఎస్వీబీసీ హెచ్‌డీ ఛాన‌ల్ ప్రారంభించాల‌ని నిర్ణ‌యించామన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలు చేస్తామన్నారు. త్వరలో తిరుమల‌లోని నాదనీరాజనం వేదికపై శ్రీమద్భగవద్గీత, గరుడ పురాణం పారాయణం ప్రత్యక్ష ప్రసారం చేస్తామని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.

You might also like