FbTelugu

తెలంగాణ లెక్క 5వేలు

హైదరాబాద్: తెలంగాణలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 5,093 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
ఈ కేసులతో కలిపి ఇప్పటి వరకు 3,51,424కు చేరుకోగా, వీరిలో 3,12,563 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 37,037 యాక్టివ్ కేసులు ఉండగా గత 24 గంటల్లో కరోనాతో 15 మంది చనిపోయారు. ఈ సంఖ్యతో ఇప్పటి వరకు మొత్తం కరోనాతో మరణించిన వారు 1824 మంది.

పట్టణాల్లో సోడియం హైపో క్లోరినేషన్…
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అన్ని మున్సిపాల్టీల్లో సోడియం హైపోక్లోరినేషన్ ద్రావకాన్ని పిచికారీ చేయాలని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశించారు. పారిశుధ్య పనులు వేగిరం చేయాలని, రోజులుగా పేరుకుపోయిన శిథిలాలను కూడా తొలగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. జనం అధికంగా సంచరించే ప్రాంతాల్లో పిచికారీ తప్పనిసరిగా చేయాలని, వాహనాలు లేని చోట అద్దెకు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఉద్యోగి విధులకు హాజరు కావాలని, సెలవులు రద్దు చేయాలని కెటిఆర్ ఆదేశించారు.
బోధ్ లో సంపూర్ణ లాక్ డౌన్…

అదిలాబాద్ జిల్లా బోధ్ లో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే పదిశాతం పైగా కరోనా పాజిటివ్ కేసుల వృద్ధి రేటు ఉండడంతో బోధ్ గ్రామ పంచాయతీ ఈ నిర్ణయం తీసుకున్నది.
వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. నిత్యావసరాల కోసం ప్రతి రోజు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు వెసులుబాటు ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.