న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణకు మార్గదర్శకాలు జారీ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, వాటిని కఠినంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కరోనా బాధితులకు చికిత్స, మృతదేహాల నిర్వహణపై ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పరిస్థితి మరింతగా దిగజారుతోందని, కేంద్రం తీసుకుంటున్న మొక్కుబడి చర్యలపై ధర్మాసనం పెదవి విరిచింది. గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్ లో ఇవాళ కొవిడ్ వార్డులో జరిగిన అగ్నిప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలు కరోనా మహమ్మారిపై పోరాటం చేయాలని ధర్మాసనం సూచించింది. ప్రజలు మాస్కులు ధరించేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదని, 80 శాతం మంది పెట్టుకోవడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితులను గమనిస్తే డిసెంబర్ నెలలో తీవ్రత అధికంగా ఉండే ప్రమాదముందని హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలలో నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
పరిస్థితి తీవ్రంగా ఉన్న వివాహాది శుభకార్యాలపై ఎందుకు నిబంధనలు తీసుకురాలేదని గుజరాత్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వేడుకలకు ఎందుకు అనుమతిస్తున్నారో చెప్పాలని, నివేదిక పంపించాలని ఆ రాష్ట్రాన్ని ఆదేశించింది. మొత్తం 10 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.