FbTelugu

ఆ నగరంలో పెళ్లి బాజాలతో కరోనా మోత…

జైపూర్: పెళ్లిళ్లు, విందు కార్యక్రమాలు కరోనా కు సూపర్ స్ప్రెడర్లు గా మారుతున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా వివాహాల విషయంలో ప్రజలు ఏమాత్రం తగ్గడం లేదు. కొందరు తక్కువ మందితో చేస్తుండగా, మరికొందరు మాత్రం భారీగానే జరిపిస్తున్నారు.

రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ నగరంలో రికార్డు స్థాయిలో వివాహాలు జరుగుతున్నాయి. మంచి ముహూర్తాలు ఉండడంతో ఈ నెల 25, 27, 30వ తేదీల్లో నాలుగు వేలకు పైగా వివాహాలు జరుగుతున్నాయి. ఈ వివాహ వేడుకలతో కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లి కుమార్తె వసుంధరా దేవీ మాట్లాడుతూ, పెళ్లి కార్యక్రమం భారీగా చేయాలనే ఆలోచన ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. కరోనా ఉంది కదా అని పెళ్లి ఆపుకోలేము కదా అని ఆమె వ్యాఖ్యానించారు.

మాస్క్ పెట్టుకుని వివాహంలో మంత్రాలు జపించడం కష్టమని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పురోహితుడు జగన్నాథ శర్మ తెలిపారు. పెళ్లి మండపం పై వధూవరులు, వారి తల్లిదండ్రులను మాత్రమే ఆహ్వానిస్తూ నియంత్రిస్తున్నామని పురోహితుడు తెలిపారు. ప్రభుత్వం వంద మందికి మించి రాకూడదని ఆంక్షలు విధించిందన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు వాడాలని తప్పనిసరి చేసింది. వేడుకలలో నిబంధనలు ఉల్లంఘించినట్లయితే రూ.25వేల జరిమానా విధిస్తున్నారు. ప్రతి పెళ్లి కార్యక్రమాన్ని వీడియో తీయాలని ఆదేశించారు.
వివాహాల కారణంగా జైపూర్ నగరంలో కేసుల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. దసరా, దీపావళి తరువాత మళ్లీ కేసులు పెరుగుతుండడంతో అధికారులు కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.