FbTelugu

కరోనా రాకాసి విలయం

ఐదు రాష్ట్రాల్లో మంచాల కొరత

ఢిల్లీ ఒక్కో మంచంపై ముగ్గురు

ఆసుపత్రుల ముందు మంచాల కోసం పడిగాపులు

పాట్నాలో ఐదు రోజులైనా మంచాలు దొరడం లేదు

స్మశాన వాటికల్లో కలప కొరత

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రాకాసి విలయం సృష్టిస్తున్నది. న్యూఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, చత్తీస్ గఢ్, గుజరాత్ రాష్ట్రాలలో కొత్త వేరియంట్ మహోగ్ర రూపం దాల్చుతోంది. ఆక్సిజన్ అందక కరోనా పేషంట్లు ఆసుపత్రిలలో చనిపోతున్నారు. స్మశాన వాటికల్లో శవాలు గంటల కొద్ది నిరీక్షిస్తున్నారు.

కొన్ని నగరాల్లో మంచాలు దొరక్క ఆసుపత్రుల బయటే పేషంట్లు పడిగాపులు కాస్తున్నారు. జార్ఖండ్ లో వైద్యం అందక పేషంట్ బయటే మృతి చెందాడు. పాట్నాలో ఐదు రోజులు అయినా మంచాలు దొరకడం లేదు. ఆసుపత్రి పరిసరాల్లోనే చావు బతుకుల మధ్య రోగులు కొట్టుమిట్టాడుతున్నారు. జార్ఖండ్ లో ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చినా వైద్యులు రావడం లేదంటూ పేషంట్ కుమార్తె దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. అర్థగంట అయినా ఇంత వరకు ఒక్కరు రాలేదంటూ విలపిస్తూ ఆరోపించింది. అప్పుడే తనిఖీకి వచ్చిన ఆరోగ్య మంత్రి బన్నా గుప్తాను మహిళ నిలదీసింది. ఓట్ల కోసం మా ఇంటి చుట్టూ తిరుగుతారు, వైద్యులు పనిచేయకపోతే చర్యలు తీసుకోరా అంటూ నిలదీసింది. వైద్యులు స్పందించకపోవడం మూలంగానే తన తండ్రి చనిపోయారని ఆరోపించింది. బాధ్యులైన వైద్యులపై విచారించి చర్యలు తీసుకుంటానని ఆరోగ్య మంత్రి బన్నాగుప్తా హామీ ఇచ్చారు.

ఆక్సిజన్ కొరత కారణంగా ముంబయిలో 10 మంది, భోపాల్ లో ఐదుగురు చనిపోయారు. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని ప్రత్యేక కార్గో విమానాల్లో వెంటనే పంపించేలా ఆదేశించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రధాని మోదీ నుంచి ఇంత వరకు ఎటువంటి సమాధానం లభించలేదు. ఇవాళ ముంబయి నగరంలో ఆక్సిజన్ సకాలంలో అందక ఆసుపత్రులలో పది మంది రోగు ప్రాణాలు కల్పోయారు. న్యూఢిల్లీలో ఆసుపత్రులలో మంచాలు దొరక్క ఒక్కో మంచంపై ముగ్గురు పేషంట్లను పడుకోపెట్టి చికిత్స చేస్తున్నారు. మంచాల కొరత తీవ్రంగా ఉండడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. పాట్నాలో మంచాల కోసం ఆసుపత్రుల ముందు ఐదు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. ఆరుబయటే చెట్ల కింద, వరండాల కింద ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

చత్తీస్ గఢ్ రాయపూర్ లో వారం రోజుల వ్యవధిలోనే 860 మంది చనిపోయారు. శవాలను భద్రపరిచే మార్చురీ నిండిపోవడంతో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడేస్తున్నారు. కొన్ని శవాలు స్ట్రెచర్ పై మరికొన్న నేల మీద పెట్టేస్తున్నారు. నగరంలో రెండు స్మశాన వాటికలు ఉండగా దహనం చేసేందుకు రెండు మూడు రోజుల సమయం తీసుకుంటున్నది. దీంతో మరో 12 బహిరంగ ప్రాంతాల్లో దహనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దహనానికి కుటుంబీకులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

మధ్యప్రదేశ్ లో భోపాల్ విషవాయువు దుర్ఘటన తరువాత మరోసారి అలాంటి దుర్భర పరిస్థితులు చూస్తున్నామని ప్రజలు మండిపడుతున్నారు. బిజెపి ప్రభుత్వం ప్రకటించే లెక్కలకు, వాస్తవ పరిస్థితుల మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఆరోపిస్తున్నారు. మంగళవారం నాడు 40 మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించగా, భోపాల్ లో నాలుగు గంటల వ్యవధిలో ఒక స్మశాన వాటికకు 40 శవాలు వచ్చాయని చెబెతున్నారు. ఆసుపత్రుల నుంచి ఎలాగొలా కష్టపడి శవాలను తీసుకువచ్చినా, అంత్యక్రియల కోసం చితి పేర్చేందుకు స్థలం దొరకడం లేదని పలువురు వాపోయారు. సోమవారం నాడు బాద్భదా స్మశాన వాటికకు 37 శవాలు రాగ ఆరోజు కూడా 37 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ బులెటిన్ లో ప్రకటించారు. దీనికి తోడు శవాలను దహనం చేసేందుకు కలప కూడా దొరడం లేదని కాటి కాపరులు చెబతున్నారు. నిరంతరం పనిచేయడం మూలంగా చేతులు బొబ్బలు కడుతున్నాయని, అలసిపోతున్నామని అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.