FbTelugu

ఇది నిజమేనా..?

కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా బాధితులకు ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకడం లేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు గుంజుతున్నారు. అయినా, బెడ్లు ఖాళీ లేవని ఆసుపత్రి యాజమాన్యాలు తిప్పి పంపుతున్నాయి. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ సౌకర్యాలు లేవని సోషల్‌ మీడియా ద్వారా అనేకమంది బాధితులు వెల్లడించారు.

హైదరాబాద్‌లో అనేకమంది కరోనా పాజిటివ్‌ రావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగి తిరిగి చివరకు చికిత్స అందకుండానే అనంతలోకాలకు చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్‌ వీఐసీలకు సోకితే.. ఇదే ప్రశ్న విఐపీలు, సెలబ్రిటీలకు కూడా వచ్చిందట. ఎంత ఖర్చు చేయగలిగిన స్థోమత ఉన్నా ఆసుపత్రుల్లో ఖాళీలు లేకుంటే ఎలా.. ఈ ప్రశ్నే వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోందట. దీంతో సెలబ్రిటీలు.. వీరిలో ముఖ్యంగా సినీరంగానికి చెందిన కొందరు ఆసుపత్రుల్లో ముందుగానే రూమ్‌లను బుక్‌ చేసుకుంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఒక్కొక్కరు ఆరు నెలలకు ఒకేసారి రూమ్‌లను బుక్‌ చేసుకుంటున్నారని, దీనికోసం కోటిన్నర దాకా ఖర్చు చేస్తున్నారన్న చర్చ హైదరాబాద్‌లో జోరుగా సాగుతోంది. ఇప్పుడు కాకపోయినా, ఎప్పుడో ఒకసారి కరోనా బారిన పడాల్సిందేనని.. అప్పటికప్పుడు ఆసుపత్రుల్లో ఖాళీ లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు వస్తాయని భావించిన ఆ సెలబ్రిటీలు నగరంలోని పేరుగాంచిన ఆసుపత్రుల్లో ఇలా ఆరు నెలలకు ముందుగానే డబ్బులు చెల్లించి రూమ్‌లను బుక్‌ చేసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది, ఎంతవరకు నిజమో కానీ.. పేదలు మాత్రం వారికి డబ్బులున్నాయి కాబట్టి ముందుగానే బుక్‌ చేసుకున్నారు.. మాలాంటి పేదల సంగతేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

You might also like