FbTelugu

చివరకు అదే గతైంది..

తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రతిరోజూ వేల కేసులు నమోదవుతున్నాయి. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా వైరస్‌ దూసుకు వెళుతోంది. దీన్ని కట్టడి చేయడం సర్కారుకు తలకు మించిన భారంగా మారింది. వాస్తవానికి కరోనా ఉధృతి తక్కువగా ఉన్నప్పుడే టెస్టుల సంఖ్యను పెంచాలని, కాంటాక్ట్‌ కేసులకు కూడా టెస్టులు చేయించాలని విపక్షాలు నెత్తీ నోరు బాదుకున్నాయి. కానీ, సర్కారు వీరి మాటలను పెడచెవిన పెట్టింది. ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయాల్సిన అవసరం లేదని, లక్షణాలు ఉన్న వారికి మాత్రమే చేస్తామని, ఐసీఎంఆర్‌ నిబంధనలు కూడా ఇలాగే ఉన్నాయని చెప్పింది. ఈ తరుణంలో కాంటాక్టు కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. దీనికి తోడు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించారు.

దీంతో పరిస్థితి మరింత చేయిదాటింది. వాయువేగంతో వైరస్‌ విజృంభించింది. ఈ తరుణంలో టెస్టుల సంఖ్యను కొంతమేర పెంచారు. కానీ, కాంటాక్టు కేసులకు, కరోనా సోకిన వారి కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు చేయడం లేదు. లక్షణాలేవీ లేకుండానే 40శాతం మందికి కరోనా వైరస్‌ సోకుతుందని వైద్య నిపుణులు తేల్చారు. కానీ, లక్షణాలు లేనివారికి టెస్టులు చేయకపోవడంతో వారిద్వారా వందల మందికి ఈ వైరస్‌ వ్యాపించింది. అత్యంత వేగంగా వైరస్‌ వ్యాపిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ముందు వరుసలో ఉంది. దీంతో కేంద్ర సర్కారు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో వెంటనే కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. కేసీఆర్‌ కూడా రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే, ఇదంతా బాగానే ఉంది. కరోనా వచ్చిన మొదట్లోనే టెస్టుల సంఖ్య పెంచాలని విపక్షాలు నెత్తీనోరు బాదుకున్నా వినని సీఎం ఇప్పుడు కరోనా పూర్తిగా కమ్మేసిన తర్వాత.. అది కూడా కేంద్రం ఆదేశిస్తే తప్ప టెస్టుల సంఖ్య పెంచేందుకు ఒప్పుకోలేదని విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. మా మాట మొదట్లోనే విని ఉంటే పరిస్థితి ఈ స్థాయికి వచ్చేది కాదు కదా అని చెబుతున్నాయి. చివరకు మేం చెప్పిందే గతైందని.. ఇప్పటికైనా టెస్టుల సంఖ్య పెంచితే మంచిదేనంటున్నాయి.

You might also like