FbTelugu

భోపాల్ ఎయిమ్స్ లో 53 మంది వైద్యులకు కరోనా

భోపాల్: మొన్న ఉత్తరప్రదేశ్ లక్నో లోని కింగ్ జార్జి హాస్పిటల్ లో పనిచేస్తున్న వైద్యులలో 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా భోపాల్ ఎయిమ్స్ లో పనిచేస్తున్న 53 మంది వైద్యులకు కరోనా వైరస్ సోకింది.
రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులను కరోనా మ్యుటెంట్లు వదలడం లేదు. గతేడాది కరోనా వైరస్ ఇంతగా వైద్యులను సోకలేదు.

కాని సెకండ్ వేవ్ లో వైద్యులకు వణుకు పుట్టించేలా సంక్రమిస్తున్నది. లక్నోలో పనిచేస్తున్న వైద్యులు వ్యాక్సిన్ రెండో డోస్ కూడా తీసుకున్న తరువాత వైరస్ సోకడం గమనార్హం. తమకు వ్యాక్సిన్ పనిచేయలేదని తెలుసుకుని వైద్యులు కంగుతిన్నారు. భోపాల్ లోని ఎయిమ్స్ లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య విద్యార్థులు మొత్తం 53 మంది కరోనా బారిన పడ్డారు. ఇద్దరు వైద్యులు, ఆరుగురు రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు, 33 మంది వైద్య విద్యార్థులు, 13 మంది వైద్య సిబ్బంది ఉన్నారు.
అయితే భోపాల్ ఎయిమ్స్ లో 102 మంది వైద్యులకు పాజిటివ్ నిర్థారణ అయ్యిందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదని, అవాస్తవమని అధికారులు ఖండించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.