FbTelugu

బీజేపీలో కరోనా భయం

హైదరాబాద్‌ నగరంలో కరోనా దూసుకుపోతోంది. ఇది కేవలం ప్రజలకే కాదు. డాక్టర్లు, పోలీసులు, సైంటిస్టులు, జర్నలిస్టులు ఇలా అనేక వర్గాల వారికీ సోకింది. ఇప్పుడు ఈ వైరస్‌ రాజకీయ నాయకులకూ పాకింది.

దీంతో నేతలు గజగజలాడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన బీజేపీ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యేకు ఈ వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఈ మహమ్మారి అంటింది. దీంతో ఆ పార్టీ నాయకులు, ఆ మాజీ ఎమ్మెల్యే ద్వారా నిత్యావసర వస్తువులు తీసుకున్న ప్రజలు కూడా భయపడుతున్నారు. ఈ మాజీ ఎమ్మెల్యే కరోనా వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌ నగరంలోని అనేక బస్తీల్లో పర్యటించారు. ఈ బస్తీల్లో పేదలకు నిత్యావసర వస్తువులు పంచడంలో బిజీబిజీగా గడిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు కూడా భారీగానే పాల్గొన్నారు. అయితే, ఆ మాజీ ఎమ్మెల్యే ఇటీవల తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారు. తనకు కరోనా సోకిందేమో అన్న అనుమానంతో ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. దీంతో కరోనా లక్షణాలు కనిపించడంతో డాక్టర్లు అతడి నమూనాలు సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపారు. అతడికి కరోనా సోకినట్టు సోమవారం డాక్టర్లు నిర్ధారించారు. దీనిని ఆ మాజీ ఎమ్మెల్యే కూడా ధ్రువీకరించారు. దీంతో ఆ మాజీ ఎమ్మెల్యేతో కలిసి పేదలకు, వలస కార్మికులకు నిత్యావసరాల పంపిణీ, భోజన ప్యాకెట్ల పంపిణీలో పాల్గొన్న ఆ పార్టీ నాయకులకు టెన్షన్‌ పట్టుకుంది. ఆ నేత నుంచి తమకు ఈ వైరస్‌ ఏమైనా వచ్చిందేమోనని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. కొందరు నేతలు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.

You might also like