FbTelugu

బడిలో కరోనా గంటలు

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. బడిలో కరోనా గంటలు మోగుతున్నాయి. ఈసారి కరోనా తన పంజాను విద్యార్థులపై విసిరింది. దీంతో వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు దాని బారిన పడి విలవిల్లాడుతున్నారు. కరోనా కాస్త నెమ్మదించడంతో తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌ క్లాసులకు బదులు ఆఫ్‌లైన్‌ క్లాసులను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే హాస్టళ్లను కూడా తెరిచింది. విద్యాసంస్థలు, హాస్టళ్లలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కానీ, చాలా విద్యాసంస్థల్లో అలాంటి జాగ్రత్తలేమీ తీసుకోవడం లేదు. పైగా హాస్టళ్లు, స్కూళ్లలో విద్యార్థులు సామాజిక దూరం పాటించకుండా ఇరుకు గదుల్లో ఉండడంతో వైరస్‌ మరింతగా విజృంభిస్తోంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది.

అనేక చోట్ల మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్స్‌ను తొలగించి ఆ బాధ్యతలను పంచాయతీ కార్మికులకు అప్పగించింది. అయితే వారు తమకు సమయం లేదని చెప్పి పాఠశాలల పరిశుభ్రతను గాలికొదిలేశారు. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు వాడడం, చాలా పాఠశాలల్లో నీటి సౌకర్యం కూడా సరిగా లేకపోవడంతో మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. కనీసం విద్యాసంస్థల్లో హ్యాండ్‌ శానిటైజర్లు కూడా అందుబాటులో లేవు. దీంతో వైరస్‌ మరింతగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కనీసం వందమందికి పైగా విద్యార్థులు కరోనా బారిన పడుతుండడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. హాస్టళ్లలో ఉండి కరోనా బారిన విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లాలని హాస్టల్‌ అధికారులు వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. కరోనా బారిన పడినవారిని ఎంతో దూరంలో ఉన్న తమ ఇళ్లకు ఎలా తీసుకెళ్లాలని.. అక్కడే ఉంచి వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరినా హాస్టల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమ పిల్లలను ఇంటికి ఎలా తీసుకుపోవాలో తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా బారిన పడుతున్న విద్యార్థులు, టీచర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. విద్యాసంస్థల్లో కరోనాను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఈ విద్యాసంవత్సరంలో ఆఫ్‌లైన్‌ క్లాసులు రద్దుచేసి ఆన్‌లైన్‌ క్లాసులనే నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరగా స్పందించి తమ పిల్లల ప్రాణాలను కాపాడాలని వారు వేడుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.