FbTelugu

పల్లెలూ పరేషాన్‌!

ఇప్పటి వరకు పట్టణాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. పల్లెలు సేఫ్‌గా ఉన్నాయన్న అభిప్రాయం అందరిలో ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పట్టణాలే కాదు.. పల్లెలు కూడా కరోనా ధాటికి విలవిల్లాడుతున్నాయి. అక్కడ కూడా కేసులతో పాటు మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. కరోనాపై ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాలు చూస్తుంటే పల్లెల్లోకి ఈ కరోనా ఎంతగా చొచ్చుకుపోయిందో అర్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని 270 మండలాల్లోని 1500 గ్రామాల్లో వైరస్‌ కాలు పెట్టిందట. అయితే, దీనికి గల కారణాలను కూడా అధికారులు గుర్తించారు.

పట్టణాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో పల్లెల నుంచి వలస వచ్చిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. ఇలా వెళ్లడంతో ప్రతి గ్రామంలో 150మంది దాకా కొత్త ముఖాలు కనిపిస్తున్నాయట. వీరిలోనే ఎక్కువమంది జ్వరంతో బాధ పడుతున్నారట. ఇది కూడా ఆరోగ్య శాఖ అధికారులే వెల్లడించారు. ప్రధానంగా పట్నం నుంచి వచ్చిన వారితోనే పల్లెలు కరోనా బారిన పడి విలవిల్లాడుతున్నాయన్న విషయం వెల్లడైంది. అంతేకాదండోయ్‌.. మున్ముందు పల్లెలకు మరింత ప్రమాదం పొంచి ఉందట. సెప్టెంబర్‌ నాటికి రాష్ట్రంలోని మొత్తం ఐదువేల గ్రామాల్లోకి కరోనా వ్యాపిస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇదే నిజమైతే పల్లెల్లో కూడా పరిస్థితి దారుణంగా తయారవుతుందని పల్లెజనం గగ్గోలు పెడుతున్నారు.

You might also like