FbTelugu

సీఎం నివాసం వద్ద కరోనా కలకలం

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా ఇప్పుడు అంతటా విస్తరిస్తోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. రోజురోజుకూ కొత్త ప్రాంతాలకు విస్తరించడంతో పాటు దీని బారిన పడి అనేకమంది మరణిస్తున్నారు.

అయితే, ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నివాసం వద్ద కరోనా కలకలం రేపింది. ఏపీ సీఎం తాడేపల్లిలో నివాసం ఉంటున్నారు. అక్కడ కొత్తగా శుక్రవారం నాలుగు కేసులు నమోదైనట్టు తేలింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన వారిలో కొంతమంది సీఎం కార్యాలయం వద్ద విధులు కూడా నిర్వహించారన్న సమాచారం అక్కడ అధికారులతో పాటు సీఎం నివాసంలో ఉండేవారిని కూడా ఆందోళనకు గురి చేస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే సీఎం నివాసం ఉండే ప్రాంతంలో ఎనిమిది కేసులు నమోదు కావడంతో రానున్న కాలంలో ఇక్కడ మరింత తీవ్రం అవుతాయేమోనని అంతా భయపడుతున్నారు.

ఈ ప్రాంతంలో కేవలం సీఎం జగన్‌ ఒక్కరే కాదు అనేకమంది మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఉంటున్నారు. దీంతో వీవీఐపీలుగా ఉన్న వారికి కూడా ఈ మహమ్మారి ఎక్కడ సోకుతుందోనని అటు వీవీఐపీలు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. అక్కడ కరోనాను నియంత్రించేందుకు అధికారులు ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటున్నారు. సమీప ప్రాంతాల వారికి టెస్టులు నిర్వహించి లక్షణాలు ఉన్న వారికి క్వారంటైన్‌కు పంపుతున్నట్టు సమాచారం.

You might also like

Leave A Reply

Your email address will not be published.