FbTelugu

బ్రెజిల్ లో కరోనా మరణ మృదంగం

రియో: బ్రెజిల్ దేశంలో కరోనా విశ్వరూపం ప్రదర్శించడంతో జనం కకావికలం అవుతున్నారు. గడచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో 4195 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచంలో అత్యధికంగా కరోనా మృతులు అమెరికా ఉండగా ఆ తరువాతి స్థానం బ్రెజిల్ దేశం ఆక్రమించింది. ఇప్పటి వరకు బ్రెజిల్ లో కరోనా వైరస్ కారణంగా 3.37 లక్షల మంది చనిపోయారు. ఇంత జరుగుతున్నా వ్యాక్సినేషన్ వేగం చేయకుండా, లాక్ డౌన్ విధించకుండా బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో చోద్యం చూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందంటూ లాక్ డౌన్ విధించకుండా వదిలేశాడు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో హాస్పిటళ్లు కరోనా పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో 90శాతం మంది కరోనా పేషెంట్లు చికిత్స తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. అనేక రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత వైద్యులను వేధిస్తున్నది. ఇప్పటి వరకు దేశంలో 8 శాతం మందికే వ్యాక్సినేషన్ చేశారు. భారత్ లోని భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ నాణ్యత సక్రమంగా లేదని బ్రెజిల్ దేశం వ్యాక్సిన్లను తిప్పింది. అంతకు ముందు కోవాగ్జిన్ వ్యాక్సిన్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నది. కేవలం కోవిషీల్డ్ వ్యాక్సిన్లను మాత్రమే పౌరులకు ఇవ్వడం మూలంగా సరిపోవడం లేదని వైద్యులు చెబుతున్నారు.

దేశంలో కనీసం మూడు వారాల పాటు సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తే తప్ప వ్యాధి అదుపులోకి రాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొత్త స్ట్రెయిన్ కారణంగానే వేగంగా వ్యాప్తి చెందుతున్నదని అంటున్నారు. ప్రభుత్వ పెద్ద తప్పిదాల మూలంగానే ఈ పరిస్థితి దాపురించిందని పౌరులు విమర్శిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.